Covid: 16 ఏళ్ల కుర్రాడు 70ఏళ్ల వృద్ధుడిలా ప్రవర్తిస్తే.. మెదళ్లనూ మార్చేసిన కొవిడ్‌!

సాధారణంగా 16 ఏళ్ల వయసులో ఉండే కుర్రాడు తన వయసుకు తగినట్లు కాకుండా ఏడు పదుల వృద్ధుడిలా ప్రవర్తిస్తే ఏమనుకుంటాం? ఉన్నట్టుండి మతిమరుపు రావడం లాంటివి గమనిస్తే ఎలా భావిస్తాం? ఇవన్నీ జరుగుతున్నాయి.. కానీ ఆ పాపం కొవిడ్‌ మహమ్మారిదేనట!!

Updated : 03 Dec 2022 09:13 IST

వాషింగ్టన్‌: సాధారణంగా 16 ఏళ్ల వయసులో ఉండే కుర్రాడు తన వయసుకు తగినట్లు కాకుండా ఏడు పదుల వృద్ధుడిలా ప్రవర్తిస్తే ఏమనుకుంటాం? ఉన్నట్టుండి మతిమరుపు రావడం లాంటివి గమనిస్తే ఎలా భావిస్తాం? ఇవన్నీ జరుగుతున్నాయి.. కానీ ఆ పాపం కొవిడ్‌ మహమ్మారిదేనట!! యువత మెదళ్లను ఈ మహమ్మారి భౌతికంగా మార్చేసి.. వాటికి వార్ధక్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ విషయం అమెరికా స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు ‘బయోలాజికల్‌ సైకియాట్రీ: గ్లోబల్‌ ఓపెన్‌ సైన్స్‌’ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. కొవిడ్‌ వల్ల యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందన్న విషయం గతంలోనే తెలిసినా, మెదళ్లకు భౌతికంగా ఏమైందో ఇంతకుముందు తెలియదని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో స్టాన్‌ఫర్డ్‌ న్యూరో డెవలప్‌మెంట్‌, ఎఫెక్ట్‌ అండ్‌ సైకోపాథాలజీ (స్నాప్‌) ల్యాబ్‌ డైరెక్టర్‌ ఇయాన్‌ గోట్లిబ్‌ తెలిపారు. ‘వయసు పెరిగేకొద్దీ మెదడు నిర్మాణం సహజంగానే మారుతుంది. టీనేజి మొదలైనప్పుడు మెదడులో జ్ఞాపకాలు, భావోద్వేగాలను నియంత్రించే హిప్పోక్యాంపస్‌, ఎమిగ్డలా అనే రెండు ప్రాంతాలు పెరుగుతాయి. అదే సమయంలో కార్యనిర్వాహక సామర్థ్యానికి సంబంధించిన కార్టెక్స్‌లోని కణజాలం సన్నబడుతుంది. కొవిడ్‌కు ముందు, తర్వాత 163 మంది పిల్లల ఎంఆర్‌ఐ స్కాన్లను పరిశీలిస్తే.. కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో ఈ వృద్ధి బాగా వేగవంతమైనట్లు తెలిసింది. సాధారణంగా పిల్లలు హింసకు, నిర్లక్ష్యానికి గురైనా, కుటుంబంలో కలతల్లాంటివి ఎదురైనా వాళ్ల మెదడు వయసు పెరుగుతుంది. అలాంటివేమీ లేకుండానే కొవిడ్‌ సమయంలో వాళ్ల శారీరక వయసు కంటే మానసిక వయసు కొన్ని రెట్లు పెరిగిపోయింది.  70-80 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తికి చెందిన సమస్యలు వస్తాయి. కానీ 16 ఏళ్ల వయసులోనే అవి వస్తే..?’ అని ఆయన వివరించారు. ప్రస్తుత యువతరానికి రాబోయే రోజుల్లో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌కు చెందిన జొనాస్‌ మిల్లర్‌ చెప్పారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు