Covid Effect: 100కుపైగా దేశాల్లో ఆరోగ్య సేవలపై ప్రభావం..!

92శాతం దేశాల్లో కొవిడ్‌ కారణంగా ఇతర వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు, ఎయిడ్స్‌, క్షయ, క్యాన్సర్‌ కేర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 09 Feb 2022 01:57 IST

ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ

వాషింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తోన్న బీభత్సానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలన్నీ ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడినట్లు ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. మొత్తంగా 129 దేశాల్లో సర్వే జరపగా అందులో 92శాతం దేశాల్లో కీలకమైన ఆరోగ్య సేవలపై కొవిడ్‌ ప్రభావం స్పష్టంగా కనిపించిందని తేలింది. ముఖ్యంగా ఇతర వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు, ఎయిడ్స్‌, క్షయ, క్యాన్సర్‌ కేర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, సంరక్షణ సేవల్లో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 ప్రబలంగా ఉన్న సమయంలో ఆరోగ్య సేవలపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు నవంబర్‌-డిసెంబర్‌ 2021 మధ్యకాలంలో డబ్ల్యూహెచ్‌ఓ ఓ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా 129 దేశాలనుంచి స్పందనలను విశ్లేషించింది. వాటిలో 100కుపైగా దేశాల్లో పోషకాహారం, క్యాన్సర్‌ కేర్‌, నాడీ సంబంధిత, హెచ్‌ఐవీ, క్షయ, మలేరియా, హెపటైసిస్‌, మానసిక రుగ్మతలతోపాటు ప్రసూతి సేవల్లో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు సర్వేలతో పోల్చి చూసినప్పుడు తీవ్రంగా ప్రభావితమైన సేవల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సేవల పునరుద్ధరణ, కొవిడ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రాముఖ్యతను తాజా సర్వే స్పష్టం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ముఖ్యంగా కొవిడ్‌ ప్రభావంతో 2020లో అత్యవసర విభాగ సేవల్లో 21శాతం అంతరాయం కలిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ సర్వే పేర్కొంది. అనంతరం 2021 ప్రారంభం నాటికి అది 29శాతానికి పెరిగింది. తాజాగా 2021 చివరి నాటికి ఎమర్జెన్సీ సేవల్లో 36శాతం క్షీణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ముఖ్యంగా సర్వే జరిపిన దేశాల్లో దాదాపు 60శాతం దేశాల్లో తుంటి, మోకాలు ఆపరేషన్లలో తీవ్ర అంతరాయం కలగడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు అందించే సంరక్షణ సేవలు మరింత దిగజారినట్లు తెలిపింది.

ఇదిలాఉంటే, సర్వే చేసిన సమయంలోనే చాలా దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ విజృంభణ మొదలయ్యింది. ఈ వేరియంట్‌ ప్రభావంతో చాలా దేశాలు కొత్త వేవ్‌లను చవిచూశాయి. దాంతో కొన్ని దేశాల్లో ఆస్పత్రులపై ఒత్తిడి పెరగడంతోపాటు కొవిడ్‌ కట్టడిపైనే ఆయా ప్రభుత్వాలు దృష్టి పెట్టడంతో ఇతర ఆరోగ్య సేవలపై మరోసారి ప్రభావం పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని