WHO: వైరస్‌ ఇంకా దృఢంగానే ఉంది.. మరిన్ని వేరియంట్లు రావచ్చు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలను మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా ఇంకా ‘చాలా దృఢంగా’నే ఉందని పేర్కొంది......

Published : 19 Mar 2022 01:32 IST

జెనీవా: ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలను మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా ఇంకా ‘చాలా దృఢంగా’నే ఉందని పేర్కొంది. వైరస్‌ సులభంగానే వ్యాపిస్తోందని.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తగ్గుముఖ పడటంతో వ్యాప్తి మరింత సులభమవుతోందని వెల్లడించింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్‌ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్‌ స్పష్టం చేశారు. మరో ఏడాదిపాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన.. లేదంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలని ర్యాన్‌ సూచించారు. ‘వైరస్‌ ఇంకా ఎంతో ఫిట్‌గా ఉంది. ఈ విషయాన్ని నిపుణులు ధ్రువీకరించారు. సులభంగా కదులుతోంది. వ్యాక్సిన్ల శక్తి తగ్గిపోయి, రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న నేపథ్యంలో వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది’ అని వెల్లడించారు. ‘కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా ప్రబలి.. మళ్లీ అక్కడి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటుంది. కట్టడి చర్యలు లేకపోతే మరింత ఉత్పరివర్తనం చెందుతుంది. కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి’ అని మైక్ ర్యాన్‌ వివరించారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని కొద్దిరోజుల క్రితమే డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ స్పష్టం చేశారు. స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందన్నారు. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని