China: చైనీయుల కరోనా తిప్పలు.. నెగెటివ్‌ వస్తే సిటీ నుంచి బయటకు..!

చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Updated : 02 May 2022 15:59 IST

షాంఘై: చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది ఇళ్లకే పరిమితమవ్వగా.. పాజిటివ్‌ వచ్చిన వారు ఇరుకైన ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా నెగెటివ్‌ వచ్చిన వారికీ అక్కడ కష్టాలు తప్పట్లేదట. వైరస్‌ సోకని వారిని ఏకంగా నగరం నుంచే బయటకు పంపిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

షాంఘైలో నెగెటివ్‌ వచ్చిన వారిని సిటీ నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలకు పంపిస్తున్నట్లు స్థానిక మహిళ లూసీ తెలిపారు. ‘‘మా కాంపౌండ్‌లో చాలా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఒకవేళ మేం ఇక్కడే ఉంటే మాకు కూడా వైరస్‌ సోకుతుందని, మమ్మల్ని నగరం నుంచి వెళ్లిపొమ్మన్నారు. అర్ధరాత్రి సమయంలో నాతో పాటు అనేక మందిని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రానికి పంపారు. ఇక్కడ క్యాబిన్‌ లాంటి గదుల్లో ఉంచారు. ఇక్కడి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు. కానీ, మాకు మరో అవకాశం లేదు. మాకు చాలా భయంగా ఉంది. షాంఘై ప్రభుత్వంపై నమ్మకం పోతోంది’’ అని లూసీ ఆవేదన వ్యక్తం చేశారు.

షాంఘైలో గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. సోమవారం అక్కడ దాదాపు 7వేల కేసులు రాగా.. 32 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మూండంచెల లాక్‌డౌన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి. ప్రజలు తమ కాంపౌండ్‌ నుంచి బయటకు రాకుండా ఇనుప బారియర్లను అమర్చుతున్నారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లోనూ వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం విధించారు. ఒక్క కేసు వెలుగుచూసినా ఆ ఇళ్లు, భవనాలను సీల్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని