Cruise ship: సిడ్నీ తీరంలో కలకలం.. క్రూజ్‌ నౌకలో 800 కొవిడ్ కేసులు..!

12 రోజుల సముద్రయానంలో భాగంగా క్రూజ్‌ నౌకలో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. దాంతో ఆ నౌకను సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. 

Published : 13 Nov 2022 01:41 IST

(ప్రతీకాత్మక చిత్రం)

కాన్‌బెర్రా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అంతలోనే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 800 మంది కరోనా బాధితులతో ఉన్న ఒక క్రూజ్ నౌక ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. అందులో 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన ఈ నౌక పేరు మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ షిప్‌.

12 రోజుల సముద్రయానంలో భాగంగా సగం ప్రయాణంలో భారీ ఎత్తున కేసులు వెలుగుచూడటం ప్రారంభమైందని క్రూజ్‌ ఆపరేటర్ కార్నివాల్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైరస్ బారినపడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని, మరికొందరిలో వ్యాధి తీవ్రత స్వల్ప స్థాయిలో ఉందని తెలిపింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌ ఉంచామని, వారికి తగిన సదుపాయాలు కల్పించామని చెప్పింది. అలాగే ఈ నౌక త్వరలో మెల్‌బోర్న్‌కు చేరుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. వారం వ్యవధిలో 19,800 కేసులు వచ్చాయి. 

ఇదిలా ఉంటే.. 2020లో కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తున్న తరుణంలో ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. రూబీ ప్రిన్సెస్‌ క్రూజ్‌ నౌకలో వైరస్ విజృంభించింది. అప్పుడు ఆ నౌకలో 900 మంది వైరస్ బారినపడ్డారు. 28 మంది మరణించారు. ఈ రెండు నౌకల కార్యకలాపాలు నిర్వహించింది ఒక సంస్థే. ఈ రెండు పరిణామాలను పోల్చడంపై ఆ సంస్థ స్పందించింది. ‘అప్పటి నుంచి మనం చాలా నేర్చుకున్నాం. కొవిడ్ గురించి మనకు ఒక అవగాహన ఏర్పడింది’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని