ఒమిక్రాన్‌ విజృంభణ వేళ.. అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులే!

ఆస్పత్రి చేరికల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులేనని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 14 Jan 2022 01:47 IST

హెచ్చరిస్తోన్న నిపుణులు

వాషింగ్టన్‌: అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతితో ప్రపంచ దేశాలు కొత్త వేవ్‌లను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 11 లక్షలు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగా కనపిస్తున్నప్పటికీ అవి అస్పత్రి చేరికలను మాత్రం నివారించలేక పోతున్నాయి. ఒకేరోజు లక్షన్నర మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి రావడం అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచిస్తోన్న నిపుణులు.. నేటి పాజిటివ్‌ కేసులే రేపటి ఆస్పత్రి చేరికలకు సంకేతాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రి చేరికల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులేనని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో నమోదవుతోన్న కేసుల్లో 98 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నట్లు అక్కడి వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) డైరెక్టర్‌ రొషెల్లీ వాలెన్‌స్కై పేర్కొన్నారు. ఇదివరకే వైరస్‌ బారినపడడం.. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పొందడం వల్ల తాజా వేరియంట్‌తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాకు చెందిన డేవిడ్‌ వోల్‌ అభిప్రాయపడ్డారు. కానీ వ్యాక్సిన్‌ తీసుకోని వారితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఆందోళనకరమేనన్నారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయేందుకు సిద్ధంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరిల్యాండ్‌కు చెందిన ప్రొఫెసర్‌ నీల్‌ సెగల్‌ ఇటీవలే హెచ్చరించారు. కొవిడ్‌ రోగుల తాకిడితో అమెరికా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడుతున్న విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీస్‌ ధ్రువీకరించింది.

సంక్షోభం దిశగా..

దేశవ్యాప్తంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ పైచేయి సాధించినట్లు సీడీసీ నివేదికలు పేర్కొంటున్నాయి. చాలా నగరాల్లో గతంలో కంటే ఎక్కువగా కొవిడ్‌ కేసులు రికార్డు కావడంతో పాటు ఆస్పత్రి చేరికలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇతర సర్జరీలను వాయిదా వేయడమో లేదా సిబ్బందిని సర్దుబాటు చేయడమో చేస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. కొలొరాడో, ఒరెగాన్‌తోపాటు చాలా రాష్ట్రాల్లో ఇదే విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు కొవిడ్‌ నిబంధనలను సరళతరం చేసేలా మరికొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేరిల్యాండ్‌ హాస్పిటల్‌ అసోసియేషన్‌ అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇలా కొవిడ్‌ బీభత్సం సృష్టిస్తోన్న వేళ.. మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కాపాడుకోవడం ఎంతో కీలకమని నీల్‌ సెగల్‌ స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితులు చేయిదాటే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు నమోదయ్యే కేసులు వచ్చే వారపు ఆస్పత్రి చేరికలకు సంకేతాలేనని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని