US Raid: డిసెంబర్‌లోనే ప్లానింగ్‌.. ఫిబ్రవరిలో అమలు..!

అమెరికా దళాలు కొన్ని నెలల నుంచి ఐఎస్‌ చీఫ్‌ ఖరేషీపై నిఘా పెట్టాయి. అతి కష్టం మీద అతను ఉంటున్న ఇంటిని గుర్తించాయి. డిసెంబర్లో ఖురేషీ పై దాడికి ప్లానింగ్‌ చేశాయి.

Updated : 05 Feb 2022 05:51 IST

పక్కా ప్రణాళికతో వ్యవహరించిన అమెరికా దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా దళాలు కొన్ని నెలల నుంచి ఐఎస్‌ చీఫ్‌ ఖురేషీపై నిఘా పెట్టాయి. అతి కష్టం మీద అతడు ఉంటున్న ఇంటిని గుర్తించాయి. డిసెంబర్‌లో ఖురేషీ పై దాడికి ప్లానింగ్‌ చేశాయి. కానీ, సమయం కోసం వేచి చూస్తూ మాటు వేశాయి. గురువారం అమెరికా అధినాయకత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే.. ఓ గుర్తు తెలియని స్థావరం నుంచి ప్రత్యేక కమాండోల పటాలం, డ్రోన్లు బయల్దేరి సిరియా-టర్కీ సరిహద్దులకు సమీపంలోని అత్మేహ్‌ వైపు పయనమయ్యాయి. ఈ ప్రదేశం ఇస్లామిక్‌ స్టేట్‌ కీలక నేత అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది.

ఖురేషీ నిక్‌నేమ్‌ ‘డెస్ట్రాయర్‌’..!

ఖురేషీపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల బహుమతిని ప్రకటించింది. గత ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బగ్దాదీ మాదిరిగా కాకుండా.. ఖురేషీ బాహ్యప్రపంచానికి అతి తక్కువ సార్లు కనిపించాడు. అతడిని ఐసిస్‌ గత కొన్నేళ్లుగా నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం చేసింది. 2019లో బగ్దాదీ ఎన్‌కౌంటర్‌ జరిగిన నాలుగు రోజులకు ఖురేషీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ప్రధాన యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉంటూ కేవలం కొరియర్ల ద్వారానే ఐసిస్‌ ఉగ్ర సంస్థను నిర్వహిస్తున్నాడు.

అత్యంత క్రూరుడిగా ఖురేషీకి పేరుంది. ఐసిస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నాన్‌ అరబ్‌  ఇతడే.  సద్దామ్‌ హుస్సేన్‌ సమయంలో ఇరాక్‌ సైన్యంలో పనిచేశాడు. సద్దామ్‌ పాలన తర్వాత అల్‌-ఖైదాలో చేరాడు. 2003లో అమెరికా సైన్యం ఖురేషీని బందీగా పట్టుకొని క్యాంప్‌ బుక్కా జైల్లో ఉంచింది. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఆ తర్వాత ఇస్లామిక్‌ స్టేట్‌ను ఏర్పాటు చేశారు. అల్‌ బగ్దాదీ మోసూల్‌ పట్టణం స్వాధీనం చేసుకోవడానికి ఖురేషీ సాయం చేశాడు. ఆ తర్వాత వేగంగా ఐసిస్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకొన్నాడు.

అల్‌-బగ్దాదీని వ్యతిరేకించిన వారిని క్రూరమైన విధానాలను అనుసరించి తప్పించేవాడు. ఖురేషీ నేతృత్వంలోని యజిదీ తెగ నరమేధాన్ని చేపట్టింది. ఆ తెగ మహిళలను చిత్ర హింసలు పెట్టి విక్రయించడం, పేలుళ్లకు పాల్పడటం వంటి దారుణాలకు పాల్పడింది.

అప్పుడప్పుడు స్నానానికి తప్పితే బయటకు రాడు..

సిరియాలోని అత్మేహ్‌ పట్టణంలో ఓ మూడంతస్తుల భవనంలో ఖురేషీ నివసిస్తున్న విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు పసిగట్టాయి. కానీ, ఖురేషీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటకు వచ్చేవాడు. అదే భవనంలో కింది ఫ్లోర్‌లో ఉండే ఒక ఐసిస్‌ ఉగ్రనాయకుడి సాయంతో లేఖలను కేడర్‌కు పంపించేవాడు. కొన్ని సార్లు ఆ భవనం మూడో అంతస్తులో ఆరుబయట స్నానం చేయడానికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో భవనంపై వైమానిక దాడి చేస్తే ఖురేషీతోపాటు అమాయకులు మరణిస్తారు. ఇక ఆ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని వారికి ఖురేషీ ఐసిస్‌ చీఫ్‌ అన్న విషయం తెలియదు. ఈ నేపథ్యంలో కమాండోలను దింపి ఆపరేషన్‌ నిర్వహించాలని నిశ్చయించారు. అటువంటి ఇంటిని కృత్రిమంగా నిర్మించి పేలుళ్లలో ఈ ఇల్లు ఏస్థాయిలో దెబ్బతింటుందో అంచనావేశారు. 

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు డిసెంబర్‌లో ఈ ఆపరేషన్‌ గురించి క్షుణ్ణంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం బైడెన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దీంతో ఓ గుర్తుతెలియని స్థావరం నుంచి అమెరికా గన్‌షిప్‌ హెలికాప్టర్లు, డ్రోన్లు , కమాండోలు రాత్రి 10 గంటల సమయంలో అత్మేహ్‌కు చేరుకొరుకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా కమాండోలకు స్థానికంగా కొంత ప్రతిఘటన ఎదురైంది. కానీ, ప్రతిఘటించిన వారిని అమెరికా దళాలు అణచివేసి ముందుకు వెళ్లాయి. ఇక ఖురేషీ ఉంటున్న ఇంటిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 10మందిని దళాలు రక్షించాయి. ఆ ఇంటిపై దాడి మొదలు కాగానే..అతడు మూడో ఫ్లోర్‌లో ఆత్మాహుతి జాకెట్‌తో పేల్చేసుకొన్నాడు. ఇక అమెరికా దళాలు రెండో ఫ్లోర్‌లో ఉంటున్న ఖురేషీ అనుచరుడు, అతని భార్యను మట్టుబెట్టాయి. పేలుడు అనంతరం వేలిముద్రలు, డీఎన్ఏ ఆధారంగా ఖురేషీని నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని