ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్‌లో అప్పుడు 20వేల మంది మృతి!

ఇండోనేషియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగాయో ఓ సారి చూద్దామా?

Published : 03 Oct 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్:ఇండోనేషియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొంటున్నారు. అయితే, గతంలనూ ఇలాంటి విషాద ఘటనలు ఎక్కడెక్కడ చోటు చేసుకున్నాయో ఓసారి పరిశీలిస్తే..

హిల్స్‌బర్గ్‌లో ఎంతమందికి గాయపడ్డారో ఇప్పటికీ మిస్టరీనే!

యూకేలోని ఫుట్‌బాల్‌ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో కెల్లా హిల్స్‌బర్గ్‌ ఘటన చాలా భయంకరమైనది. ఎంతమందికి గాయాలయ్యాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అది 1989, ఏప్రిల్‌ 15. హిల్స్‌బర్గ్‌ వేదికగా లివర్‌పూల్‌-నాటింగ్‌హాం జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. పరిమితికి మించి ప్రేక్షకులు మైదానానికి వచ్చేశారు. సరిపడా చోటు లేకపోవడంతో వారంతా మ్యాచ్‌ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 96 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 766 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అంచనా. ఈ ఘటనకు గుర్తు చేసుకుంటూ లివర్‌పూల్‌ జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ వారి జర్సీ కాలర్‌పై 96 నెంబర్‌ను ముద్రించుకుంటారు.

ఈస్టడో నేసియోనల్‌ మైదానం..328 మంది మృతి

అది 1964, మే 24. పెరూలోని లైమా నగరంలో గల ఈస్టడో నేసియోనల్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో అర్జెంటీనా-పెరూ మధ్య ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌ చివరి దశకు వచ్చింది. ఈ లోగా ఓ గోల్‌ వివాదాస్పదమైంది. ఒక్కసారిగా పెరు దేశానికి చెందిన అభిమానులంతా మైదానంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రధాన మార్గాలన్నీ మూసివేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 328 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇబ్రాక్స్‌ మైదానంలో రెండు సార్లు తొక్కిసలాట

స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గోవ్‌ నగరం ఇబ్రాక్స్‌ మైదానంలో రెండుసార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. తొలుత 1902, ఏప్రిల్‌ 5న స్టాండ్‌ కూలిపోవడంతో 25 మంది బలికాగా.. దాదాపు 600 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 1972లో  రేంజర్స్‌,  క్రాస్‌ టౌన్‌ రైవల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 66 మంది మృతి చెందగా.. 140 మందికి గాయాలయ్యాయి.

మాస్కోలో 340మంది బలి! 

అది 1982, అక్టోబరు 20. యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేన్‌(యూఈఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో డచ్‌ క్లబ్‌-స్పార్టక్‌ మాస్కో జట్ల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌ చివర్లో ప్రేక్షకుల్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దాదాపు 7 ఏళ్ల వరకు సోవియట్‌ ప్రభుత్వం దాచిపెట్టింది. కానీ, ఈ తొక్కిసలాటలో 340 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కొందరు చెబుతుంటారు. 

ఘనాలో 127 మంది..!

ఘనా దేశ రాజధాని అక్రాలోని ఒహేనే డిజాన్‌ క్రీడా మైదానంలో 2001, మే 9న ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక జట్లయిన అక్రా హార్ట్స్‌, అసంటే కొటోకొ జట్ల మధ్య ఓ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఉన్నట్లుండి ప్రేక్షకులు ఒక్కసారిగా మైదానంలోకి బాటిళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. లిమాలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా తప్పించుకునే క్రమంలో తొక్కిసలాటతో ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 127 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి.

దశరథ్‌ రంగస్థల మైదానం..కాఠ్‌మాండు

అసియా ఖండంలోని ఫుట్‌బాల్‌ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇది అతి భయంకరమైనది. 1988, మార్చి 12న నేపాల్, బంగ్లాదేశ్‌ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా.. ఒక్కసారిగా వడగండ్ల వాన కుమ్మరించింది.దీంతో ప్రేక్షకుల గ్యాలరీలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో 93 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇవేకాకుండా, టర్కీలోని అటాటుర్క్‌ స్టేడియంలో 1967లో జరిగిన ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రసెల్స్‌లోని హైసెల్‌ మైదానంలో 1985లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 600 మంది గాయపడ్డారు.

రోమ్‌లో 20 వేల మంది మృతి!

మైదానాల్లో తొక్కిసలాటలు జరగడం ఇప్పుడు కొత్తేం కాదు. కీ.శ 27లో రోమ్‌ సమీపంలోని ఫిడేనియాలోని ఓ మైదానంలో జరిగిన ప్రమాదంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. గ్లాడిటోరియల్‌ క్రీడల సందర్భంగా చెక్క థియేటర్‌ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత క్రీ.శ 140లో రోమ్‌లో ఓ చెక్క స్టాండు కూలిపోవడంతో 1100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది.

మైదానాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో జరిగిన తొక్కిసలాటల్లో అత్యధికంగా మరణాలు చోటుచేసుకున్న ఘటనలు..

* సెప్టెంబర్‌ 24, 2015- సౌదీ హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అత్యధికంగా 2411 ముస్లిం యాత్రికులు చనిపోయారు.

* 1990 జులైలోనూ అక్కడ 1426 మంది, 2006 జనవరిలో 345 మంది, 2004 ఫిబ్రవరిలో 251 మంది, 1998 ఏప్రిల్‌లో 118 మంది మృత్యువాతపడ్డారు.

* మే 23, 1994 - మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గొవారీ (Gowari stampede) కమ్యూనిటీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయాలపాలయ్యారు.

* ఫిబ్రవరి 20, 2003- అమెరికా రోడె ఐల్యాండ్‌లోని వార్విక్‌ నగరంలోని నైట్‌ క్లబ్‌ వేదికపై ఏర్పాటు చేసిన టపాసులతో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 200 మంది గాయాలపాలయ్యారు.

* జనవరి 25, 2005- మహారాష్ట్రలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఆగస్టు 31, 2005- బాగ్దాద్‌లో ఓ మతపరమైన ఊరేగింపు జరుగుతోన్న సమయంలో బ్రిడ్జ్‌ కుప్పుకూలిపోయింది. ఆ ఘటనలో 640 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

* సెప్టెంబర్‌ 30, 2008- రాజస్థాన్‌ జోధ్‌పుర్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 168 మంది చనిపోగా..100 మంది గాయాలపాలయ్యారు.

* నవంబర్‌ 22, 2010- కాంబోడియా రాజధానిలో ఓ పండుగ వేళ జరిగిన ఘర్షణల్లో 340 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఏప్రిల్‌ 30, 2021-ఇజ్రాయెల్‌లో మౌంట్‌ మెరాన్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 45 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని