Modi-Putin: ‘చిన్నారుల మరణాలతో గుండె తరుక్కుపోతోంది’ - పుతిన్‌తో మోదీ

యుద్ధంలో చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని పేర్కొన్న మోదీ.. కేవలం చర్చల ద్వారానే శాంతిస్థాపన సాధ్యమని అన్నారు.

Published : 09 Jul 2024 18:55 IST

మాస్కో: బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌పై కొనసాగుతోన్న దండయాత్ర గురించి మాట్లాడిన ఆయన.. అమాయక చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడితో భేటీ అయిన ఆయన పలు కీలక అంశాలను పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

‘‘ఉక్రెయిన్‌ యుద్ధం గురించి స్వేచ్ఛగా చర్చించుకోవడం సంతోషంగా ఉంది. దీనిపై పరస్పర అభిప్రాయాలను గౌరవించుకున్నాం. యుద్ధమైనా.. సంక్షోభమైనా లేదా ఉగ్రచర్య అయినా.. ప్రాణనష్టం జరిగితే మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ బాధపడతారు. ఇక అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ బాధ వర్ణించలేనిది. ఈ విషయంపైనా మీతో చర్చించాను’ అని రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ అన్నారు.

‘‘యుద్ధభూమిలో పరిష్కారాలు సాధ్యం కావని నాకు తెలుసు. బాంబులు, బుల్లెట్ల నడుమ జరిగే శాంతి చర్చలు విజయవంతం కావు. కేవలం చర్చల ద్వారానే శాంతిమార్గం అనుసరించాల్సి ఉంటుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతిస్థాపనకు సహకరించేందుకు భారత్‌ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్‌ శాంతిపక్షాన ఉందని మీతోపాటు యావత్‌ ప్రపంచానికి హామీ ఇస్తున్నానన్న మోదీ.. ఇందుకు పుతిన్‌ మాట్లాడిన మాటలు భరోసా కలిగించాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు