Published : 11 May 2022 16:42 IST

China Corona: చైనా కొవిడ్ జీరో వ్యూహాన్ని వదిలేస్తే.. కేసుల సునామే..!

16 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా

బీజింగ్: కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా.. వైరస్ కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తూ, అగచాట్లు పడుతోంది. స్వల్పస్థాయిలో కేసులు వచ్చినా.. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తున్నారు. ఇప్పుడు గనుక చైనా తన ఈ దీర్ఘకాలిక వ్యూహాన్ని విడిచిపెడితే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సునామీలా విజృంభిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దాని ఫలితంగా 16 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఈ అధ్యయనం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. 

చైనాలో వ్యాక్సినేషన్‌తో పొందిన రోగనిరోధక స్థాయులు ఒమిక్రాన్‌ ఉద్ధృతిని అరికట్టేందుకు సరిపోవని ఆ అధ్యయనం పేర్కొంది. ఆ వేరియంట్‌ కారణంగా ఐసీయూలు నిండిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. టీకా పొందిన వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం, మెరుగైన పనితీరు చూపని టీకాలపై ఆధారపడటం ఇందుకు కారణంగా కావొచ్చని విశ్లేషించింది. ఈ సమయంలో మాస్‌ టెస్టింగ్, కఠిన లాక్‌డౌన్ నిబంధనలు వంటివి లేకపోతే.. ఒమిక్రాన్‌ చైనాలో తీవ్ర ఉద్ధృతి చూపిస్తుందని అంచనా వేసింది. దాని వల్ల 112.2 మిలియన్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉంది. వారందరిలో వ్యాధి లక్షణాలు కనిపించనున్నాయి. అందులో 5.1 మిలియన్ల మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. 1.6 మిలియన్ల మరణాలు సంభవించనున్నాయని పేర్కొంది.   

ఇదిలా ఉండగా.. చైనా కొవిడ్ జీరో వ్యూహంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు నిబంధనలు పాటిస్తూ, టీకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో మరోసారి వైరస్‌ విజృంభిస్తే, తట్టుకునేలా వైరస్‌తో కలిసి జీవించే విధానాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే ( కొవిడ్‌ జీరో) వ్యూహాన్ని అమలు చేస్తూ.. కొద్దిపాటి కేసులకే ప్రజలను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఒకసారి ఈ విధానంపై పునరాలోచన చేసుకోవాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనామ్ కూడా సూచన చేశారు. 

ఈ ఏడాది చివర్లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కాంగ్రెస్‌లో దేశ అగ్ర నాయకుడిగా  జిన్‌పింగ్ రికార్డు స్థాయిలో మూడవసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటివరకు  కొవిడ్ జీరో విధానం నుంచి ఆ దేశం బయటకు రాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికాలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించగా.. అసలు ఆ మహమ్మారికి పురుడుపోసిన చైనాలో మరణాలను నియంత్రించడమూ అక్కడి ప్రభుత్వానికి రాజకీయ లబ్ధి చేకూర్చింది. అయితే ఈ కఠిన ఆంక్షలు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈసారి వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని ఆ దేశం చేరుకోలేకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని