Ukraine Crisis: జాగ్రత్త.. బయటకు రాకండి.. రిస్క్‌ చేయకండి: విదేశాంగ శాఖ

రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యలో ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత....

Updated : 05 Mar 2022 17:25 IST

సుమీ నగరంలో చిక్కుకున్న విద్యార్థుల పట్ల తీవ్ర ఆందోళన

దిల్లీ: రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యలో ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల విషయంలో భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా తరలించేందుకు సురక్షితమైన కారిడార్‌ల ఏర్పాటు కోసం రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు తక్షణమే కాల్పులు విరమించాలని ఇరు దేశాలపైనా ఒత్తిడి తీసుకొస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. మరోవైపు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్లలోనే ఉండాలని విద్యార్థులకు సూచించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎవరూ అనవసరంగా రిస్క్‌ చేయొద్దని కోరారు. విద్యార్థులతో విదేశాంగ శాఖ, రాయబార కార్యాలయాలు నిరంతరం టచ్‌లో ఉంటున్నట్టు పేర్కొన్నారు. సుమీ నగరంలో  దాదాపు 700 మంది భారతీయులు చిక్కుకున్నట్టు బాగ్చి నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే.

అంతకముందు, సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సరిహద్దుకు ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఓ వీడియోను పోస్ట్‌ చేసిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పైవిధంగా స్పందించింది. సుమీ నుంచి ఇదే తమ ఆఖరి వీడియో అనీ.. తమకు ఏదైనా జరిగితే భారత ప్రభుత్వం, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయమే బాధ్యత వహించాలంటూ అంటూ విద్యార్థులు పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి తమను త్వరగా తీసుకెళ్లాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే, వారిని ఎంబసీ సంప్రదించడంతో రిస్క్‌ చేయకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. 

మరోవైపు, సుమీ నగరంలో చిక్కుకుపోయిన వందలాది విదేశీ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు తాము చేయగలిగినదంతా చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ తెలిపింది. రష్యా దాడులతో ఈ నగరం ప్రస్తుతం మానవతా సంక్షోభం అంచున ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజల్ని రక్షించుకొనేందుకు తాము చేయగలిగినంత చేస్తున్నామంటూ ట్వీట్‌ చేసింది. 

అలాగే, ఖర్కివ్‌లో చిక్కుకుపోయిన మరికొంత మంది భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా పెసోచిన్‌లో ఉన్న 298మంది భారతీయ విద్యార్థులను తరలించేందుకు ల్వీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసినట్టు రాయబార కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని