US: సిక్కు వ్యక్తిపై దాడి తీవ్రంగా కలచివేసింది: అమెరికా

గత వారం అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన భారత సంతతి ట్యాక్సీ డ్రైవర్‌పై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది....

Published : 09 Jan 2022 11:13 IST

భిన్నత్వమే తమ బలమని ఉద్ఘాటన

న్యూయార్క్ ‌: గత వారం అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన భారత సంతతి ట్యాక్సీ డ్రైవర్‌పై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ఈ దాడి తమని ‘తీవ్రంగా కలచివేసింది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భిన్నత్వమే అమెరికాను మరింత బలంగా మారుస్తోందని స్పష్టం చేసింది. ద్వేషపూరిత దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖలోని ‘బ్యూరో ఆఫ్‌ సౌత్‌ సెంట్రల్‌ ఏషియన్‌ అఫైర్స్‌ విభాగం’ ట్వీట్‌ చేసింది.

జేఎఫ్‌కే విమానాశ్రయం ఆవరణలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడి చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను జనవరి 4న నవజ్యోత్‌పాల్‌ కౌర్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అది ఎప్పుడు జరిగిందో తెలియదని పేర్కొన్నారు. అయితే, ఈ వీడియోను ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి తీశారని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ బాధితుడిపై సదరు వ్యక్తి పిడి గుద్దులు కురిపించడం వీడియోలో కనిపించింది. అమెరికాలో ఇంకా ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని కౌర్‌ ఆరోపించారు. పైగా సిక్కు క్యాబ్‌ డ్రైవర్లపై ఇది పదే పదే కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటనను న్యూయార్క్‌లోని భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా పరిగణించింది. విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ దర్యాప్తు జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts