Deltacron: డెల్టా+ఒమిక్రాన్‌= డెల్టాక్రాన్‌

ఎప్పటికప్పుడు మ్యుటేషన్‌ చెందుతూ కరోనా మహమ్మారి మానవాళికి సవాల్‌ విసురుతోన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు డెల్టా వేరియంట్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి కాగా, ఇప్పుడు ఒమిక్రాన్‌ వణికిస్తోంది. తాజాగా ఈ రెండు వేరియంట్లు కలగలిసిన...

Updated : 10 Jan 2022 12:30 IST

నికోసియా: ఎప్పటికప్పుడు మ్యుటేషన్‌ చెందుతూ కరోనా మహమ్మారి మానవాళికి సవాల్‌ విసురుతోన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు డెల్టా వేరియంట్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి కాగా, ఇప్పుడు ఒమిక్రాన్‌ వణికిస్తోంది. తాజాగా ఈ రెండు వేరియంట్లు కలగలిసిన ‘డెల్టాక్రాన్‌’ స్ట్రెయిన్‌ సైప్రస్‌లో బయటపడింది. సైప్రస్‌ యూనివర్సిటీ బయాలజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌, లెబోరేటరీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మాలిక్యులర్‌ వైరాలజీ అధిపతి లియోండియోస్‌ కోస్ట్రికిస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం ఒమిక్రాన్, డెల్టా కో-ఇన్ఫెక్షన్‌ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండింటి కాంబినేషన్‌ ఉన్న స్ట్రెయిన్‌ను కనుగొన్నాం’ అని ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ స్ట్రెయిన్‌.. డెల్టాకు సమానమైన జన్యు నేపథ్యాన్ని కలిగి ఉందని, అలాగే కొన్ని ఒమిక్రాన్‌ మ్యుటేషన్లూ ఉన్నాయని తెలిపారు. దీంతో దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు.

సైప్రస్‌లో ఇప్పటివరకు ఈ రకమైన 25 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఈ స్ట్రెయిన్‌ మ్యుటేషన్‌ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందని కోస్ట్రికిస్‌ బృందం అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఈ కేసుల నమూనాలను.. వైరస్‌ మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ ‘జీఐఎస్‌ఏఐడీ’కి పంపారు. డెల్టా, ఒమిక్రాన్‌తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమా? వ్యాప్తి వేగం తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే, అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే దీన్ని అధిగమించినట్లు భావిస్తున్నానని అన్నారు. ఈ కొత్త స్ట్రెయిన్‌తో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైప్రస్ ఆరోగ్యశాఖ మంత్రి మిచాలిస్ హడ్జిపాండేలాస్ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని