Biden: బైడెన్‌ గెలవడం కష్టమే.. సొంత పార్టీ టాప్‌ ఫండ్‌రైజర్‌ క్లూనీ

Joe Biden: బైడెన్‌ గెలుపు అవకాశాలపై స్వపక్ష నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతామని పార్టీ టాప్‌ ఫండ్‌రైజర్ క్లూనీ అభిప్రాయపడ్డారు.

Published : 11 Jul 2024 09:22 IST

Joe Biden | వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు (Joe Biden) స్వపక్షం నుంచి రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జార్జ్‌ క్లూనీ సైతం తాజాగా బైడెన్‌ పోటీపై పెదవివిరిచారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే డెమోక్రాటిక్‌ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి పెద్దఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో క్లూనీ ఒకరు కావడం గమనార్హం. అలాగే ఆయనకు బైడెన్‌తో (Biden) సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

‘‘ఈ అధ్యక్షుడితో మనం నవంబరు ఎన్నికల్లో గెలవబోం. పైగా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ ఓడిపోబోతున్నాం. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్‌ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. క్లూనీ జూన్‌లో అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి విచ్చేసిన బైడెన్‌లో తాను చాలా మార్పులు చూశానని క్లూనీ తెలిపారు. 2010 నాటి.. కనీసం 2020 నాటి ఉత్సాహం కూడా ఆయనలో కనిపించలేదన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో సంవాదంలో అందరూ చూసిన వ్యక్తినే తామూ చూశామని తెలిపారు.

ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్‌ (Donald Trump) రెండోసారి గెలుస్తారని.. అది ఊహంచుకుంటేనే భయంగా ఉందని క్లూనీ అభిప్రాయపడ్డారు. సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, ఓ స్నేహితుడిగా బైడెన్‌ను తాను ఎంతో ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వం, విలువలను తాను గౌరవిస్తానన్నారు. గత నాలుగేళ్లలో అనేక ఆటుపోట్లను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారని తెలిపారు.

ఎన్నికలు సజావుగా జరిగితే ట్రంప్‌దే విజయం..

బైడెన్‌తో (Joe Biden) సంవాదం తర్వాత ట్రంప్‌నకు ఆదరణ మరింత పెరిగిందని ‘సిక్కు అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌’ గ్రూప్‌ అధినేత జస్దీప్‌ సింగ్‌ జస్సీ తెలిపారు. ఎన్నికలు చట్టబద్ధంగా జరిగితే ట్రంప్‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ కోసం సిక్కులతో పాటు భారతీయులు, ఆసియావాసులు పెద్దఎత్తున విరాళాలు సేకరిస్తున్నారని తెలిపారు. వారంతా ట్రంప్‌తోనే (Trump) ఉన్నారని పేర్కొన్నారు.

ట్రంప్‌నకు మద్దతుగా ఉన్నందుకు ఒకప్పుడు చాలామంది తనని విమర్శించేవారని జస్దీప్‌ తెలిపారు. ఇప్పుడు వారే తన వద్దకువచ్చి తామూ ట్రంప్‌ వైపే నిలబడతామని చెబుతున్నారన్నారు. బైడెన్‌ (Biden) అసమర్థత ట్రంప్‌తో చర్చలోనే బయటపడిందని విమర్శించారు. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలు, నేరాలు వంటి అనేక సమస్యలను అమెరికా ఎదుర్కొంటోందన్నారు. విదేశాంగ విధానం పూర్తిగా బలహీనపడిందని.. ప్రపంచ వేదికపై అమెరికా నాయకత్వం కరవైందని ఆరోపించారు. ఇవన్నీ బైడెన్‌ ఓటమికి కారణంగా నిలుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని