China- America: అది అగ్నికి ఆజ్యం పోసే చర్యే.. అమెరికా జనరల్‌పై మండిపడిన చైనా

భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా అభివృద్ధి చేస్తున్న సైనిక వసతులు ప్రమాదకరంగా ఉన్నాయంటూ.. అమెరికా అగ్రశ్రేణి జనరల్‌ ఛార్లెస్‌ ఎ.ఫ్లిన్‌ చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య...

Published : 10 Jun 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా అభివృద్ధి చేస్తున్న సైనిక వసతులు ప్రమాదకరంగా ఉన్నాయంటూ.. అమెరికా అగ్రశ్రేణి జనరల్‌ ఛార్లెస్‌ ఎ.ఫ్లిన్‌ చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య వివాదం నేపథ్యంలో.. అగ్నికి ఆజ్యం పోసే చర్యగా పేర్కొంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే సంకల్పం, సామర్థ్యం.. బీజింగ్, దిల్లీలకు ఉన్నాయని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పష్టం చేశారు.

‘భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా సైనిక కార్యాచరణ స్థాయి కళ్లు తెరిపించేలా ఉంది. వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో నిర్మిస్తున్న కొన్ని మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఆ నిర్మాణాలు ఎందుకు అవసరమవుతున్నాయో, వారి అసలు ఉద్దేశం ఏమిటో సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది’ అని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ ఫ్లిన్ బుధవారం దిల్లీలో వ్యాఖ్యానించారు. తూర్పు లద్ధాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతను ఫ్లిన్‌ ప్రస్తావించారు. దీనిపై జావో గురువారం ఈ మేరకు స్పందించారు.

‘ఈ సరిహద్దు సమస్య చైనా, భారత్‌ల మధ్య ఉంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఇరుపక్షాలకు ఉన్నాయి’ అని జావో స్పష్టం చేశారు. ‘ఈ విషయంలో కొంతమంది అమెరికా అధికారులు అగ్నికి ఆజ్యం పోసేందుకు యత్నిస్తున్నారు. మా వైపు వేలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. బదులుగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడేందుకు వారు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులు స్థిరత్వం దిశగా సాగుతున్నాయన్నారు.

2020 మే నుంచి తూర్పు లద్ధాఖ్‌లో భారత్‌, చైనా దళాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. జూన్‌లో గల్వాన్ లోయలో ఇరుపక్షాల మధ్య ఘర్షణలతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. తూర్పు లద్దాఖ్‌లో 2020 ఏప్రిల్‌ ముందునాటి పరిస్థితులు తిరిగి నెలకొనాలని ఇండియా పట్టు పడుతుండగా, డ్రాగన్‌ ససేమిరా అంటోంది. ఫలితంగా ఎప్పటికప్పుడు చర్చలు నిష్ఫలమవుతున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి సున్నితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం రెండు దేశాలూ దాదాపు 50-60 వేలమంది సైనికులను మోహరించి ఉండటంతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. అదే సమయంలో సరిహద్దుకు సమీపంలో మౌలిక వసతులను చైనా వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని