Missing Plane: విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్‌ యూనియన్‌ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి.

Published : 16 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్‌ యూనియన్‌ కూల్చివేసిన ఓ ప్రయాణికుల విమానం (Kaleva) ఏమైపోయిందోనన్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఎనిమిది దశాబ్దాల తర్వాత.. ఎస్తోనియా రాజధాని టాలన్ సమీపంలో బాల్టిక్‌ సముద్రంలోని కెరీ అనే చిన్న ద్వీపం వద్ద 70 మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి. తమ బృందం వీటిని గుర్తించినట్లు టూక్రిటూడే ఓయూ అనే డైవింగ్‌, సముద్ర భూగర్భ సర్వే సంస్థ వెల్లడించింది.

ఫిన్లాండ్‌ ‘ఏరో ఎయిర్‌లైన్స్‌’ (ప్రస్తుతం ఫిన్‌ఎయిర్‌)కు చెందిన కలేవా అనే విమానం 1940 జూన్‌ 14న ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ఎస్తోనియాలోని టాలన్‌ నుంచి ఫిన్లాండ్‌లోని హెల్సింకికి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఒకరు అమెరికా దౌత్యవేత్త హెన్రీ డబ్ల్యూ. ఆంథెయిల్‌ జూనియర్‌ కాగా, ఇద్దరు ఫ్రెంచ్, ఇద్దరు జర్మన్లు, ఒక స్వీడన్‌, ఒక ఎస్తోనియన్-ఫిన్నిష్ జాతీయుడు ఉన్నారు. అయితే, టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే సోవియట్‌ యూనియన్‌కు చెందిన రెండు బాంబర్లు ఆ విమానాన్ని కూల్చివేశాయి. ఒకవైపు సోవియట్‌తో ఫిన్లాండ్‌  శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న మూడు నెలలకే.. మరోవైపు స్టాలిన్‌ బలగాలు మూడు బాల్టిక్‌ దేశాల (ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా)ను ఆక్రమించే కొన్ని రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

పుతిన్‌ నోట సంధి మాట

మాస్కో ఆక్రమణకు ముందు టాలన్‌ నుంచి ఎగిరిన చివరి విమానం ఇదే. అనంతరం అదే నెల 17న ఎస్తోనియా స్టాలిన్‌ వశమైంది. ఆ ఘటనపై ఫిన్లాండ్‌ అధికారికంగా మొదటి నుంచి మౌనమే వహించింది. బాల్టిక్ సముద్రం మీదుగా ఓ మిస్టరీ క్రాష్ జరిగిందని మాత్రమే తెలిపింది. హెన్రీని రెండో ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన తొలి అమెరికన్లలో ఒకరిగా అగ్రరాజ్యం పరిగణిస్తోంది. రష్యా దండయాత్ర ప్రణాళిక నేపథ్యంలో ఎస్తోనియా, లాత్వియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాల నుంచి అతి ముఖ్యమైన పత్రాలు, సామగ్రితో ఆయన ఆ విమానంలో బయలుదేరారు. 

ఫిన్లాండ్‌తో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. ప్రయాణికుల విమానాన్ని సోవియట్‌ కూల్చివేయడానికి గల కారణాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. సున్నితమైన సమాచారం, పత్రాలను ఎస్తోనియా దాటకుండా అడ్డుకునేందుకు ఈ దాడి జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోవియట్ బాంబర్ పైలట్ల తప్పిదం కూడా అయిఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. 1991లో ఎస్తోనియా తిరిగి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కలేవాను కనుగొనడానికి వివిధ ప్రయత్నాలు చేసింది. అయితే.. అవేవీ ఫలించలేదు. అమెరికా నౌకాదళానికి చెందిన ఓషనోగ్రాఫిక్ సర్వే నౌక ‘పాత్‌ఫైండర్’ కూడా 2008లో కెరీ ద్వీపం చుట్టూ జల్లెడ పట్టినా.. శకలాలు లభ్యం కాలేదు. ఎట్టకేలకు దాన్ని గుర్తించడంతో.. ఎనిమిది దశాబ్దాలకుపైగా కొనసాగిన మిస్టరీ వీడినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని