Ukraine Crisis: అంతరిక్ష కేంద్రం.. భారత్‌, చైనాలపై పడాలనుకుంటున్నారా?

కొత్త ఆంక్షలు రష్యా అంతరిక్ష కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపుతాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

Updated : 26 Feb 2022 15:19 IST

అమెరికా ఆంక్షలపై మండిపడ్డ రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ చీఫ్‌

మాస్కో : ఉక్రెయిన్‌పై సైనిక దాడికి దిగిన రష్యాపై దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించారు. కొత్త ఆంక్షలు రష్యా అంతరిక్ష కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపుతాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ(రోస్కొమస్‌) చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ మండిపడ్డారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్‌ఎస్‌) ఎవరు రక్షిస్తారు?అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

‘మీరు రష్యాకు సహకారాన్ని నిరోధించినట్లయితే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అనియంత్రిత కక్ష్యలో తిరగకుండా, అమెరికా, యూరప్‌లపై పడకుండా ఎవరు రక్షిస్తారు?’. 500 టన్నుల బరువుండే ఐఎస్‌ఎస్‌ భారత్‌, చైనాలపై పడే అవకాశం కూడా ఉంది. అలాంటి అంచనాలతో ఆ దేశాలను బెదిరించాలనుకుంటున్నారా?’ అని దిమిత్రి ట్విటర్‌లో ప్నశ్నించారు.

‘ఐఎస్‌ఎస్‌ రష్యా మీదుగా ప్రయాణించదు. కాబట్టి దీంతో ఎలాంటి నష్టమైనా మీకే.. మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని మరో ట్వీట్‌లో నిలదీశారు. 

సైనిక ఆధునీకరణ, అంతరిక్ష కార్యక్రమాల పురోగతిని తగ్గించే విధంగా హైటెక్‌ దిగుమతుల విషయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఈ విధంగా స్పందించింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అంతరిక్ష పరిశోధనల విషయానికి వస్తే మాత్రం రష్యా, అమెరికా ఒకదానికొకటి దశాబ్దాల తరబడి సహకారం అందించుకుంటూ వస్తున్నాయి.

ఇక ఐఎస్‌ఎస్‌ విషయానికి వస్తే.. దాదాపు ఫుట్‌బాల్‌ స్టేడియం అంత పొడవుండే ఈ భారీ నిర్మాణం 400 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేస్తుంది. భారరహిత స్థితిలో ఇందులో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, జర్మనీకి చెందిన ఒక వ్యొమగామి నిరంతరం పనిచేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని