Donald Trump: పుతిన్‌ సహాయం కోరిన డొనాల్డ్‌ ట్రంప్‌..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహాయం కోరారు. జో బైడెన్‌ కుటుంబాన్ని నష్టపరిచే ఎటువంటి సమాచారమున్నా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Published : 31 Mar 2022 01:22 IST

బైడెన్‌ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారాన్ని కోరిన అమెరికా మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహాయం కోరారు. జో బైడెన్‌ కుటుంబాన్ని నష్టపరిచే ఎటువంటి సమాచారమున్నా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రష్యా సంపన్నుల (ఒలిగార్క్‌)తో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలన్నారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో బైడెన్‌ కుటుంబం లక్ష్యంగా చేసుకొని డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

‘పుతిన్‌ ఇప్పుడు మన దేశానికి అభిమాని కాదు. అయినప్పటికీ ఆయన నుంచి ఓ సమాచారం కోరుతున్నా. మాస్కో మేయర్‌ భార్య బైడెన్‌లకు 3.5మిలియన్‌ డాలర్లు ఎందుకిచ్చినట్లు..? ఈ ప్రశ్నకు పుతిన్‌ దగ్గర సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఆ విషయం మనకు తెలియాలి’ అంటూ ఓ అమెరికన్‌ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రష్యాతో హంటర్‌ బైడెన్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన ఆయన.. ఆ వివరాలను పుతిన్‌ బయటకు చెప్పాలన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణను తీవ్రంగా పరిగణిస్తోన్న అమెరికా ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది. ఇటీవల ఐరోపాలో పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్‌.. పుతిన్‌ వ్యవహార తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన ఒక కసాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని రష్యా అధ్యక్ష భవనం కూడా ఖండించింది. బైడెన్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ పుతిన్‌కు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇలా రష్యా-అమెరికా దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ అధ్యక్షుడి కుటుంబాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ లక్ష్యంగా చేసుకోని పుతిన్‌ సహాయం కోరడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని