Trump Twitter: మస్క్‌ కీలక నిర్ణయం.. ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

Trump Twitter: ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునురద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ట్విటర్‌లో పోల్‌ నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Updated : 20 Nov 2022 10:15 IST

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విటర్‌లో పోల్‌ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఆదివారం ప్రకటించారు. ట్రంప్‌ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. పాత సందేశాలతో కూడిన ఆయన ట్విటర్‌ ఖాతా ప్రస్తుతం సామాజిక మాధ్యమ వేదికపై కనిపిస్తోంది.

ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్‌ పోల్‌ నిర్వహించారు. దీనికి 15 లక్షలకు పైగా మంది తమ స్పందనను తెలియజేశారు. వీరిలో 51.8 శాతం మంది పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారు. మరో 48.2 శాతం యూజర్లు వద్దని తెలిపారు. కానీ మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో మస్క్‌ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజల తీర్పే దైవ నిర్ణయం’ అని అర్థం వచ్చే లాటిన్‌ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘బైడెన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021, జనవరి 8న ట్రంప్‌ చేసిన చివరి ట్వీట్‌తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది.

2020 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ట్విటర్‌ ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక అప్పుడు ట్విటర్‌లో ఉన్న న్యాయ నిపుణురాలైన భారతీయ అమెరికన్‌ విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. మరింత హింస జరగకుండా ఉండేందుకే ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ఆమె వివరణ ఇచ్చారు. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత సీఈఓ పరాగ్‌ అగర్వాల్ సహా విజయ గద్దెను ఆయన తొలగించిన విషయం తెలిసిందే.

మస్క్‌ పోల్‌పై ట్రంప్‌ శనివారం రిపబ్లికన్‌ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో స్పందించారు. పోల్‌ను స్వాగతించిన ఆయన మస్క్‌ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అయితే, తిరిగి ట్విటర్‌లో క్రియాశీలకంగా మారడంపై మాత్రం పరోక్షంగా విముఖత వ్యక్తం చేశారు. తనకు ‘ట్రుత్‌ సోషల్‌’ అనే సొంత సామాజిక మాధ్యమం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. పైగా ట్విటర్‌కు తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని