Donald Trump: పోర్న్ స్టార్ కేసులో అభియోగాలు.. ట్రంప్ భవితవ్యమేంటి?
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)పై అభియోగాలు నమోదయ్యాయి. మరి ఈ కేసు ఆయన రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయగలరా?
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్య రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్ స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై నేరపూరిత అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయనపై నేరారోపణలను న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ ధ్రువీకరించింది. దీంతో ఇప్పుడు ఆయన క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టిన ఓ వ్యక్తి ఇలాంటి అభియోగాలు ఎదుర్కోవడం అమెరికా (America) చరిత్రలో ఇదే తొలిసారి. మరి ఈ కేసులో ట్రంప్‌ను ఇప్పుడు ఎలా విచారిస్తారు..? 2024 అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్ భవితవ్యమేంటి..? (Donald Trump Indictment)
లొంగిపోనున్న ట్రంప్..
ఇండిక్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. ఈ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు ట్రంప్ (Donald Trump) కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంటుంది. ట్రంప్‌పై అధికారికంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేసేంతవరకు ఈ ఇండిక్ట్‌మెంట్‌ను సీల్ చేసి ఉంచుతారు. అప్పటిదాకా.. ఆయనపై ఏ అభియోగాలు మోపారన్న దానిపై స్పష్టత రాదు. ట్రంప్ లొంగుబాటు గురించి ఆయన లీగల్ టీమ్‌తో మాన్‌హట్టన్ ప్రాసిక్యూషన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఫ్లోరిడాలో ఉన్నారు. వచ్చే సోమవారం న్యూయార్క్ చేరుకుని.. మంగళవారం కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నట్లు అమెరికా మీడియా కథనాల సమాచారం.
సంకెళ్లు వేస్తారా..?
ఇండిక్ట్‌మెంట్‌కు గురైన నిందితుడు కోర్టులో లొంగిపోయిన తర్వాత అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ ట్రంప్ (Donald Trump) లొంగిపోతే.. ఆయన్ను అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తారు. ముందు ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆయనను విచారించి అరెస్టు రిపోర్ట్ తయారుచేస్తారు. సాధారణంగా సామాన్య నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సంకెళ్లు వేసి తీసుకొస్తారు. అయితే ట్రంప్ మాజీ అధ్యక్షుడైనందున ఆయనకు కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి. సంకెళ్లు లేకుండానే ఆయనను తీసుకొస్తారని సమాచారం. అంతేగాక, అధికారుల అదుపులో ఉన్న సమయంలోనూ ఆయనకు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రత ఉంటుంది.
బెయిల్ వచ్చే అవకాశముందా..?
ట్రంప్ (Donald Trump)పై ఎలాంటి అభియోగాలు మోపారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ కేసుపై కోర్టులో ఆయన తన వాదనలు వినిపించుకునే అవకాశముంటుంది. తన ఇండిక్ట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ ఆధారాలు చూపిస్తే.. దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది. దానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలు అంత తీవ్రంగా లేకపోతే.. ఆయనకు కొంతమొత్తం జరిమానా విధిస్తారు. దీంతో ఆయన అదే రోజు విడుదల కావొచ్చు. ఒకవేళ తీవ్రంగా ఉంటే.. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. అలాగైనా సొంత పూచికత్తుపై ఆయనకు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.
అధ్యక్ష ‘పోటీ’పై ప్రభావమెంత..?
2024 అధ్యక్ష ఎన్నికల్లో (Presidential Elections) పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్న సమయంలో ఈ అభియోగాలు నమోదవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ రాజకీయ భవిత్వానికి ఈ కేసు అడ్డంకిగా మారనుందా? లేకపోతే ఆయన మరింత బలంగా తిరిగొస్తారా? అన్నదానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. అయితే అమెరికా రాజ్యాంగంలో.. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు లేదా దోషులుగా తేలిన వారు అధ్యక్ష పదవికి పోటీ చేయొద్దన్న నిబంధనేమీ లేదు. దీంతో ఆయన పోటీకి ఆటంకం ఉండకపోవచ్చు. మరోవైపు రిపబ్లికన్లు కూడా ఆయనకు మద్దతుగానే ఉన్నారు. దీంతో ఈ కేసును ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయని అమెరికా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్