Donald Trump: నేరారోపణల ధ్రువీకరణ.. ట్రంప్‌ అరెస్టు తప్పదా..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump).. ఊహించిందే జరిగింది. ఒక అనైతిక ఒప్పందం విషయంలో ఆయనపై వచ్చిన నేరారోపణలను గ్రాండ్‌ జ్యూరీ ధ్రువీకరించింది. దీంతో ఆయన అరెస్టు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated : 31 Mar 2023 13:45 IST

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అగ్రరాజ్య (America) చరిత్రలోనే తనపై వచ్చిన నేరారోపణలకు క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై ఆరోపణలు రాగా..దానిపై తాజాగా న్యూయార్క్‌ గ్రాండ్ జ్యూరీ వాటిని ధ్రువీకరించి ఆయనపై అభియోగాలు మోపింది. దీంతో ఆయన ఇప్పుడు క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్నారు.  ట్రంప్‌ లొంగుబాటుపై మాన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ.. ఆయన న్యాయవాదులతో చర్చించారు. ట్రంప్‌ లొంగిపోతే సుప్రీంకోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌.. వచ్చే సోమవారం న్యూయార్క్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన మన్‌హట్టన్‌ కోర్టులో హాజరయ్యే అవకాశాలున్నాయి.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం (నాన్‌-డిజ్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌) చేసుకున్నారనే ఆరోపణలను ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సదరు మహిళ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది. అయితే, ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన 2024 అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారాన్ని నీరుగార్చేందుకే ‘డెమొక్రాటిక్’ప్రాసిక్యూటర్ ద్వారా తప్పుడు విచారణ చేయిస్తోందని ఆరోపించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ తాను అరెస్టయితే పెద్ద ఎత్తున నిరసనలు తెలపపాలని రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు ఆయన పిలువునివ్వడం గమనార్హం. ఈ కేసులో ట్రంప్(Donald Trump) అరెస్టవుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండుసార్లు అభిశంసనను చవిచూశారు.  క్యాపిటల్‌ హిల్‌పై దాడి చేసేలా తన మద్దతుదారులను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే  అధికారంలో ఉన్న సమయంలో కీలక పత్రాలు మిస్సింగ్ వంటి తదితర విషయాల్లో ట్రంప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక అనైతిక ఒప్పందం కేసులో ఆయన అరెస్టయితే తన రాజకీయ చరిత్రలో అదొక మచ్చగా మిగులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ అణచివేతే: ట్రంప్‌

‘ఇది పూర్తిగా రాజకీయ అణచివేత. ఎన్నికల పరంగా ఉన్నతస్థాయిలో జరుగుతోన్న జోక్యమిది. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు న్యాయవ్యవస్థను ఆయుధంగా మార్చుకుంటున్నారు. ట్రంప్‌ను అణచివేసేందుకు డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు అనూహ్యమైన చర్యకు దిగారు. చివరకు అమాయకమైన వ్యక్తిపై అభియోగాలు మోపారు. మాన్‌హట్టన్ అటార్నీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లుగా ఆడుతున్నారు. ఎన్నికల ఏడాదిలో ఇదొక అవకాశవాద చర్య’ అంటూ ట్రంప్ ఈ అభియోగాలపై తీవ్రంగా స్పందించారు.  దీనిపై ట్రంప్ తరఫు న్యాయవాది మాట్లాడారు. ‘ట్రంప్ ఎలాంటి నేరానికి పాల్పడలేదు. కోర్టులో దీనిపై మా పోరాటాన్ని కొనసాగిస్తాం’అని వెల్లడించారు.

ఇక మరోపక్క.. ఈ నేరారోపణల ధ్రువీకరణపై పోర్ట్న్‌ స్టార్‌ స్ట్రోమీ డానియల్స్  ట్వీట్ చేసింది. ‘నాకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈ సమయంలో నాకు ఎంతోమంది సందేశాలు పంపారు. కానీ ఇప్పుడు స్పందించలేను. సంబరాలు చేసుకోలేను’ అని తన పోస్టులో ఆనందం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని