Biden-Trump: రాణి అంత్యక్రియల్లో బైడెన్‌ సీటుపై.. ట్రంప్‌ సెటైర్‌..!

ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ సామ్రాజ్యాన్ని ఏలి మహారాణిగా వెలుగొందిన ఎలిజబెత్‌-2కు యావత్ ప్రపంచం కన్నీటి వీడ్కోలు పలికింది. లండర్‌లోని

Published : 20 Sep 2022 16:38 IST

లండన్‌: ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ సామ్రాజ్యాన్ని ఏలిన రాణి ఎలిజబెత్‌-2కు యావత్ ప్రపంచం కన్నీటి వీడ్కోలు పలికింది. లండర్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌లో సోమవారం జరిగిన ఎలిజబెత్‌-2 అంతిమ సంస్కారాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో బైడెన్‌ వెనుక వరుసలో కూర్చోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఇలా జరిగేది కాదన్నారు.

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో రాణి ఎలిజబెత్‌ పార్థివ దేహాన్ని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం వివిధ దేశాల నుంచి హాజరైన 500 మంది దేశాధినేతలతో పాటు 2 వేల మంది అతిథులు రాణికి నివాళులర్పించారు. వెస్ట్‌మినిస్టర్‌ అబేలో జరిగిన ఈ కార్యక్రమంలో జో బైడెన్‌, ఆయన సతీమణికి 14వ వరుసలో సీట్లు కేటాయించారు. ఇది వెనుక వైపు నుంచి కేవలం ఏడో వరుస మాత్రమే. దీంతో బైడెన్‌పై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

బైడెన్‌ ఫొటోను తన ట్రూత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన ట్రంప్‌.. ‘‘కేవలం రెండేళ్లలోనే అమెరికా పరిస్థితి ఎలా మారిందో చూడండి. ప్రపంచ వేదికపై అమెరికాకు గౌరవం దక్కట్లేదు. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఉంటే.. వారు నన్ను ఇలా వెనుక వరుసల్లో కూర్చోబెట్టేవారు కాదు. మన దేశం కూడా ఇప్పుడున్న దానికంటే చాలా భిన్నంగా ఉండేది. రియల్‌ ఎస్టేట్‌ అయినా.. రాజకీయాలైనా.. జీవితమైనా.. లొకేషన్‌ అనేది చాలా ముఖ్యం’’ అని బైడెన్‌ను విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని