Donald Trump: అణు దాడికి గతంలో ట్రంప్‌ ఉబలాటం.. శ్వేతసౌధం అధికారుల అవస్థలు

ట్రంప్‌(Donald Trump) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఉత్తరకొరియాపై అణుదాడి చేయాలని ఉబలాటపడిపోయారు. దీంతో శ్వేత సౌధం అధికారులు ఆయన్ను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Updated : 13 Jan 2023 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాపై అణుదాడి గురించి తీవ్రంగా ఆలోచించారు. ఈ విషయాన్ని ‘ట్రంప్‌ వర్సెస్‌ ది యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’ పుస్తక రచయిత మైఖెల్‌ తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించిన అనుబంధ భాగం త్వరలోనే రానుంది. దీనిలో నాటి శ్వేతసౌధం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాన్‌ కెల్లీ అనుభవాలను రాశాడు. 2017లో ట్రంప్‌ శ్వేతసౌధంలో అడుగు పెట్టిన తర్వాత ఉత్తరకొరియాపై దుందుడుకు వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ‘ప్రపంచం చూడని భయంకర పరిణామాలు ఉంటాయి’ ‘సర్వనాశనం చేస్తాం’ ‘లిటిల్‌ రాకెట్‌ మ్యాన్‌’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను కవ్వించారు. దీనికి తోడు ట్రంప్‌ ట్వీట్లు కూడా దుందుడుకుగా ఉన్నాయి. అప్పట్లో ఇవి జాన్‌ కెల్లీని తీవ్రంగా భయపెట్టాయి.

* అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఉత్తరకొరియాపై అణుదాడి చేసే వ్యూహంపై అధ్యక్ష కార్యాలయంలో ట్రంప్‌(Donald Trump) సీనియర్‌ అధికారులతో చర్చించారు. దాడి తర్వాత నిందను ఏదో ఒక దేశంపై వేస్తే ఎలా ఉంటుందని ఆయన అడిగారట. 

* ఆ సమయంలో అధ్యక్షుడికి సర్దిచెప్పేందుకు కెల్లీ స్పందించాల్సి వచ్చింది. దాడి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, దీనికి తోడు దాడి బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమని నచ్చజెప్పేందుకు యత్నించారు.

* ఆ తర్వాత కెల్లీ చొరవ తీసుకొని సీనియర్‌ సైనికాధికారులను శ్వేత సౌధానికి పిలిపించారు. అమెరికా-ఉత్తరకొరియా మధ్య యుద్ధం అవకాశాలు, వాటి పరిణామాలు, ఎంత మంది చనిపోతారు అన్న విషయాలను చెప్పించారు. ఆ విషయాలేవీ ట్రంప్‌(Donald Trump)ను ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో దాడి తర్వాత అమెరికా ఎదుర్కొనే ఆర్థిక పర్యవసానాలను కూడా అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. 

* ముందస్తు అణుదాడికి కాంగ్రెస్‌ అనుమతి ఉండాలని చెప్పడంతో ట్రంప్‌(Donald Trump) చిరాకుపడ్డారు. ‘నా వద్ద పెద్ద అణు బటన్‌ ఉంది’ అని  2018లో జనవరిలో ట్వీట్‌ చేయడం సంచలనం సృష్టించింది.

* ట్రంప్‌ (Donald Trump) అధ్యక్ష కార్యాలయంలోకి వచ్చాక కూడా అసురక్షితమైన ఫోన్‌ నుంచి మిత్రులకు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు కాల్స్‌ చేసి ‘ఉత్తర కొరియాపై సైనిక దాడి’ గురించి చర్చించేవారు. పుస్తక రచయిత మైఖెల్‌ తన సరికొత్త అనుబంధంలో ఈ అంశాలను మొత్తం ప్రస్తావించారు. ఈ పుస్తకంలోని కీలక విషయాలు ఆంగ్లవార్త సంస్థ ఎన్‌బీసీ చేతికి చిక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని