Donald Trump: పుతిన్‌తో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరు..!

రష్యా దాడులతో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 13 Mar 2022 19:03 IST

బైడెన్‌ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: రష్యా దాడులతో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనా యంత్రాంగమే కారణమన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరని విమర్శలు గుప్పించారు. దక్షిణ కరోలినా ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌, ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇంకా మార్గాలున్నాయని చెప్పారు.

‘పిరికితనం, అసమర్థత వంటి బలహీనతలు బైడెన్‌కు ఉన్నప్పటికీ ఈ భయంకరమైన యుద్ధంలో అమెరికన్లు చిక్కుకోకుండా ఉక్రెయిన్‌ విషాదానికి ముగింపు పలికేందుకు ఇంకా మార్గాలున్నాయి. ఇదే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యాకు దీటుగా అమెరికా స్పందించాలని సూచించిన ఆయన.. రష్యా ఇంధన వనరులపై పశ్చిమదేశాలు శాశ్వతంగా ఆధారపడకుండా చేయడం వల్ల కలిగే పరిణామాలను తెలియజేస్తూ మాస్కోను బెదిరించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడితో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరన్న ట్రంప్‌.. తన వ్యక్తిత్వమే యుద్ధం నుంచి అమెరికాను దూరంగా ఉంచిందని ఉద్ఘాటించారు.

ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పలు నగరాలను హస్తగతం చేసుకున్న రష్యా సేనలు.. ఉక్రెయిన్‌ నగరాలను తీవ్ర స్థాయిలో ధ్వంసం చేస్తున్నాయి. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో మాట్లాడిన ఆయన.. జెరుసలెంలో పుతిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని