QUAD Meet: క్వాడ్‌ సదస్సు వేళ ఉలిక్కిపడుతోన్న చైనా

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అనుసరిస్తోన్న వ్యూహం విఫలమవడం ఖాయం అంటూ వ్యాఖ్యానించింది.

Published : 23 May 2022 17:29 IST

ఇండో పసిఫిక్‌ వ్యూహం విఫలమేనన్న డ్రాగన్‌

బీజింగ్‌: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రాంతంలో పర్యటిస్తూ మిత్రదేశాలతో కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తోన్న చైనా.. అమెరికా, దాని మిత్రదేశాల ప్రయత్నాలపై ఉలిక్కిపడుతోంది. తాజాగా వీటిపై స్పందించిన చైనా.. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అనుసరిస్తోన్న వ్యూహం విఫలమవడం ఖాయం అంటూ వ్యాఖ్యానించింది.

‘ఇండో పసిఫిక్‌ వ్యూహం’ పేరుతో అమెరికా చేస్తోన్న ప్రయత్నాలు ఈ ప్రాంతంలో విభజనలను సృష్టించే, ఘర్షణ ప్రేరేపించే, శాంతిని నాశనం చేసే వ్యూహాలని వాస్తవాలే నిరూపిస్తాయి’ అని చైనా విదేశాంగశాఖ మంత్రి వాగ్‌ యీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టోతో భేటీ అయిన సమయంలో చైనా మంత్రి ఈ విధంగా మాట్లాడారు. స్వేచ్ఛ, బహిరంగత అని చెప్పుకుంటోన్న అమెరికా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. చైనాను అదుపు చేసేందుకు ఓ ముఠాగా ఏర్పడి చిన్న చిన్న గ్రూపులను ఏర్పాటు చేయడంపైనే ప్రధానంగా ఆసక్తి చూపిస్తోందని విమర్శించారు.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్‌ తొలిసారిగా ఆసియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌తో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతోనూ సమావేశమైన జో బైడెన్‌.. జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ అధినేతలతోనూ క్వాడ్‌ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అనుసరించే ఆర్థిక ప్రణాళిక (IPEF)పైనా కుటమి దేశాల నేతలతో చర్చించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా జపాన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని