Ukraine Crisis: మానవతా కాన్వాయ్‌ లక్ష్యంగా క్రెమ్లిన్‌ దాడులు.. 23మంది దుర్మరణం

ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగరంపై రష్యా విరుచుకుపడింది. బాంబులతో దాడికి పాల్పడిన ఘటనలో 23 మంది మరణించారు.

Updated : 30 Sep 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపోరిజియా (Zaporizhzhia) నగరంలోని ఓ వాహన కాన్వాయ్‌పై దాడి చేయగా.. 23 మంది పౌరులు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జపోరిజియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రష్యా ఆక్రమిత భూభాగానికి వెళ్తున్న మానవతా కాన్వాయ్‌ను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాయని తెలిపారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు, రోడ్డుపై పడిఉన్న మృతదేహాల చిత్రాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా ఆక్రమిత భూభాగం నుంచి తమ బంధువులను తీసుకువచ్చేందుకు పౌరులు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని స్టారుఖ్​ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ద్వారా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు రష్యా గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలు రష్యాలో విలీనానికి అంగీకారం తెలిపాయని పుతిన్‌ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రెమ్లిన్‌లో దీనికోసం నిర్వహించే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొంటారని, ఆయా ప్రాంతాలకు చెందిన మాస్కో అనుకూల పరిపాలకులు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేస్తారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని