Updated : 13 Aug 2022 06:48 IST

కరవు కోరల్లో ఇంగ్లాండ్‌.. ఖాళీగా రిజర్వాయర్లు.. నీటి వాడకంపై ఆంక్షలు

లండన్‌: ఇంగ్లాండ్‌ కరవుతో (Drought) కటకటలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది తీవ్ర లోటు వర్షపాతం నమోదయ్యింది. దీంతో ప్రధాన నదుల్లో ప్రవాహం తగ్గిపోతుండగా రిజర్వాయర్లు కూడా ఎండిపోతున్నాయి. పరిస్థితులను సమీక్షించిన అధికారులు ఇంగ్గాండ్‌లోని (England) చాలా ప్రాంతాల్లో కరవు ప్రకటించారు. కెంట్‌ అండ్‌ సౌత్‌ లండన్‌, హెర్ట్స్‌ అండ్‌ నార్త్‌ లండన్‌, థేమ్స్‌, ఈస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌, సోలెంట్‌ అండ్‌ సౌత్‌ డౌన్స్‌ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కరవును ప్రకటించగా.. త్వరలోనే మిగతా ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గడిచిన యాభై ఏళ్లగా ఈ స్థాయిలో వేసవి కాలం ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని నెలలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఇంగ్లాండ్‌లో.. వేసవి తాపానికి రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి. జులై నాటికి ఇంగ్లాండ్‌లో ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యంలో కేవలం 65శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పంటల విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్యారెట్‌, ఉల్లి, షుగర్‌ బీట్‌, యాపిల్‌ పంటల సాగు దాదాపు 10 శాతం నుంచి 50శాతం నష్టపోతుందని అంచనా. మరోవైపు ఆహారంలేమితో పశువులు అల్లాడుతున్నాయని.. దీని ప్రభావం పాల ఉత్పత్తులపైనా పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనడంతో సమీక్షించిన అధికారులు నీటి పొదుపు చర్యలకు ఉపక్రమించారు.

ఈ నేపథ్యంలో అనేక నగరాల్లో కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన ఇంగ్లాండ్‌ అధికారులు.. అక్కడ నీటి వాడకంపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా గొట్టపు పైపుల ద్వారా ట్యాప్‌ వాటర్‌తో కార్లను కడగడంపై నిషేధంతో పాటు వాహనాలు, భవనాలు, కిటికీలను శుభ్రపరచడానికి స్ప్రింక్లర్లను ఉపయోగించకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఇంగ్లాండ్‌లో నెలకొన్న కరవు పరిస్థితులు అక్కడి ఆహార ఉత్పత్తులపైనా పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళా దుంపతోపాటు మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని