Nepal: నేపాల్‌ నుంచి దుబాయ్‌ బయలుదేరిన విమానం ఇంజిన్‌లో మంటలు

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్‌కు చెందిన విమానం టేకాఫ్‌ అయిన వెంటనే ఒక ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మరో ఇంజిన్‌కు బదలాయించడంతో అన్ని ఇండికేటర్లు సాధారణంగానే ఉన్నాయని పైలట్లు కంట్రోల్‌ టవర్‌కు సమాచారం అందించారు.   

Updated : 25 Apr 2023 01:22 IST

ఖఠ్మాండ్‌: నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్‌ బయలుదేరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దుబాయ్‌కు చెందిన ఫ్లైదుబాయ్‌ విమానం కాఠ్‌మాండూలోని త్రిభువన్‌దాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని రెండు ఇంజిన్‌లలో ఒకదాంట్లో మంటలు చెలరేగినట్లు విమానాశ్రయ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని తక్షణం ల్యాండ్‌ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే అన్ని ఇండికేటర్లు సాధారణంగా ఉన్నాయని, విమానం గమ్యస్థానం దిశగా సాగుతున్నట్లు పైలట్లు కంట్రోల్‌ టవర్‌కు సమాచారం అందించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘కాఠ్‌మాండూ నుంచి దుబాయ్‌ బయలు దేరిన ‘ఫ్లైదుబాయ్‌ 576’ విమానం ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన గమ్యస్థానం దిశగా వెళుతోంది. కాఠ్‌మాండూ విమానాశ్రయ కార్యకలాపాలు ఇప్పుడు సాధారణంగానే ఉన్నాయి’’ అని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ పేర్కొంది. ‘‘సమస్య ఏర్పడిన ఇంజిన్‌ను కాసేపటి తర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేసి మరో ఇంజిన్‌కు బదలాయించారు. ప్రస్తుతం విమానం కాఠ్‌మాండూ విమానాశ్రయంలో దిగకుండానే గమ్యస్థానం దిశగా ప్రయాణం సాగిస్తోంది’’ అని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి దుబాయి విమానం సోమవారం రాత్రి 9.20 గంటలకు బయలుదేరింది. విమానంలో 150 మంది ఉండగా వారిలో సుమారు 50 మంది నేపాల్‌ ప్రయాణికులు కాగా, మిగతావారు ఇతర దేశాలకు చెందినవారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన విషయం తెలియగానే ఉత్కంఠ చెలరేగింది. అత్యవసర ల్యాండింగ్‌ కోసం అధికారులు చర్యలు చేపట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు