బర్గర్‌ స్థానంలో పానీపూరీ వస్తుందా..? ప్రవాసుల ప్రశ్నకు జైశంకర్‌ సమాధానమిదే..!

పాశ్చాత్య దేశస్థులు బర్గర్‌కు బదులుగా పానీపూరీ తినే రోజులు వస్తాయా అని ఓ ప్రవాసాంధ్రుడు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ (S Jaishankar)ను ప్రశ్నించారు. దీనికి ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.

Updated : 17 May 2023 19:04 IST

స్టాక్‌హోం: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) గత ఇటీవల స్వీడన్‌ (Sweden )లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన ప్రవాస భారతీయుల (Indian diaspora)తో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి ప్రపంచీకరణ (globalisation of the Indian culture) గురించి ప్రవాసులు అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.

స్వీడన్‌లో జరిగిన ఈయూ ఇండో-పసిఫిక్‌ మంత్రిత్వస్థాయి సదస్సుకు జైశంకర్‌ (S Jaishankar) హాజరయ్యారు. పర్యటన మధ్యలో ప్రవాస భారతీయులతో ఆయన ఓ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో వచ్చిన సంస్కరణలు, విదేశాల్లో ఉన్న భారతీయులకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రపంచీకరణ గురించి జైశంకర్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘‘పాశ్చాత్య దేశస్థులు హాంబర్గర్‌కు బదులుగా పానీపూరీ తినే రోజులు వస్తాయా? New York అనే పేరుకు బదులుగా New Delhi అనే ప్రింట్‌ ఉండే టీషర్టులను చూస్తామా?’’ అని ప్రశ్నించారు.

దీనికి జైశంకర్‌ (S Jaishankar) బదులిస్తూ.. ‘‘మీరు చెప్పినవన్నీ త్వరలోనే నిజమవ్వాలని ఆశిద్దాం. అది జరిగితే మీ నోరు తీపిచేస్తాను’’ అని చెప్పడంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. అనంతరం విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం మనం ఇప్పుడిప్పుడే చూడటం మొదలుపెడుతున్నాం. ఇందుకు పలు కారణాలున్నాయి. ఒకటి ప్రవాసభారతీయులు విశ్వమంతా ఉండటం. రెండోది మన ఆత్మవిశ్వాసం పెరగడం. దీనికి ఓ మంచి ఉదాహరణ చెబుతాను. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించింది. ఇప్పుడు అది ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు యోగాపై ఉత్సాహం చూపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు’’ అని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు