Diabetes: గర్భిణుల్లో మధుమేహానికి ఆరంభంలోనే చికిత్స మేలు

గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహాన్ని తొలిదశలోనే నియంత్రిస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated : 22 Jun 2024 09:16 IST

శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి 

దిల్లీ: గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహాన్ని తొలిదశలోనే నియంత్రిస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాంటివారికి కాన్పు కూడా సాఫీగా జరగడానికి మార్గం సుగమమవుతుందని వివరించారు. అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ పరిశోధన చేసింది. ఇందులో భారత్‌లోని ఎయిమ్స్‌ పరిశోధకులు కూడా పాల్గొన్నారు. 

గర్భిణుల్లో వచ్చే ప్రధాన సమస్య మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఊబకాయమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి ఏడుగురు గర్భిణుల్లో ఒకరికి ఈ సమస్య తలెత్తుతోందని చెప్పారు. గర్భం ధరించాక ఆరు నెలలు దాటాకే వీరిని పరీక్షించి, చికిత్స చేస్తుంటారు. ఒకవేళ చికిత్స పొందకుంటే వారికి అధిక రక్తపోటు, సీజేరియన్‌ కాన్పు, మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. శిశువుకూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలివీ.. 

  • మధుమేహానికి మూలాలు.. గర్భధారణకు ముందు నుంచే ఉండొచ్చు. జీవక్రియకు సంబంధించిన ఆ మార్పులను గర్భం ధరించిన 14 వారాల్లోగా పసిగట్టొచ్చు.  
  • మధుమేహ బాధిత గర్భిణుల్లో 30-70 శాతం మందికి మొదటి 20 వారాల్లోనే రక్తంలో అధిక గ్లూకోజ్‌ ఉంటోంది. గర్భం ధరించాక కాస్త ఆలస్యంగా ఈ రుగ్మత బారినపడేవారితో పోలిస్తే వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. 
  • మధుమేహానికి సరైన చికిత్స పొందని మహిళలకు నెలలు నిండకుండా కాన్పు జరిగే ముప్పు 51 శాతం అధికం. అలాగే వారికి శస్త్రచికిత్స ద్వారా కాన్పు జరిగే అవకాశం 16 శాతం ఎక్కువ. 
  • ఇలాంటి మహిళకు భవిష్యత్‌లో టైప్‌-2 మధుమేహం ముప్పు 10 శాతం పెరుగుతుంది. వారికి అధికరక్తపోటు, ఫ్యాటీ లివర్, గుండె జబ్బు ముప్పు కూడా ఎక్కువే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని