Earthquake: 50 వేలు దాటిన మృతుల సంఖ్య.. 5 లక్షలకుపైగా నివాసాలు ధ్వంసం!

ఇటీవలి భారీ భూకంపంతో తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. ఈ క్రమంలోనే ఇళ్ల పునర్నిర్మాణానికి తుర్కియే పనులు మొదలుపెట్టింది.

Published : 25 Feb 2023 18:02 IST

అంకారా: దాదాపు రెండు వారాల క్రితం నాటి భారీ భూకంపంతో తుర్కియే(Turkey), సిరియా(Syria)లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. తదనంతరం కూడా వేల సంఖ్యలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య తాజాగా 50 వేలు దాటింది. ఒక్క తుర్కియేలోనే 44 వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో ఇప్పటివరకు 5900కుపైగా పౌరులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల్లో భూకంపం(Earthquake) ధాటికి 1.60 లక్షలకుపైగా భవనాలు కూలిపోయాయి, లేదా దెబ్బతిన్నాయి. వీటిలో 5.20 లక్షల నివాసాలు ఉన్నట్లు అధికారుల తెలిపారు.

ప్రకృతి విలయానికి తుర్కియేలో దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇళ్ల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఏడాది లోగా ఇళ్లను తిరిగి నిర్మిస్తామని దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ఇప్పటికే ప్రకటించారు. నెలల వ్యవధిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ హామీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇళ్ల పునర్నిర్మాణంలో వేగం కన్నా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. తాజా భూకంపంలో నాసిరకమైన నిర్మాణాలతోనే ప్రాణనష్టం ఎక్కువగా వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

సుమారు రూ.1.24 లక్షల కోట్ల వ్యయంతో 2 లక్షల అపార్ట్‌మెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల గృహాలను నిర్మించాలనేది తుర్కియే ప్రాథమిక ప్రణాళిక. గృహాల పునర్నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని అమెరికన్‌ బ్యాంకు ‘జేపీ మోర్గాన్’ అంచనా వేసింది. విధ్వంసం కారణంగా 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, 5 లక్షల కొత్త ఇళ్లు అవసరమని ఐరాస అభివృద్ధి కార్యక్రమం(UNDP) వెల్లడించింది. 1999లో వాయువ్య టర్కీలో సంభవించిన భూకంపం 1.3 కోట్ల టన్నుల శిథిలాలు మిగిల్చితే.. తాజా విపత్తు కారణంగా 11.6 కోట్ల నుంచి 21 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయినట్లు యూఎన్‌డీపీ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు