Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!
భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే, సిరియాలు వెంటనే ‘‘స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ అంతర్జాతీయ చార్టర్’ను యాక్టివేట్ చేయమని కోరాయి. అసలు ఈ చార్టర్ ఏంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియే(Turkey), సిరియా(Syria)లోని ప్రాంతాలను భారీ భూకంపం(Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, దెబ్బతిన్న రహదారులు, ధ్వంసమైన నిర్మాణాలతో ఇరుదేశాల్లో విలయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తుర్కియే, సిరియాలు.. వెంటనే ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్(The International Charter Space and Major Disasters)’ను యాక్టివేట్ చేయమని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. అసలు ఏంటీ చార్టర్ తెలుసుకుందాం.
వాస్తవ పరిస్థితుల అంచనాకు..
ఏటా ప్రపంచవ్యాప్తంగా తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, సునామీ, వరదలు, కార్చిచ్చుల వంటి ప్రకృతికారక.. చమురు కాలుష్యం, పారిశ్రామిక పేలుళ్ల వంటి మానవప్రేరేపిత విపత్తులు ఏర్పడుతున్నాయి. వాటి కారణంగా మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇళ్లు, నిర్మాణాలు, రోడ్లు, వంతెనలవంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రకృతి వనరులూ దెబ్బతింటున్నాయి. అయితే, భారీ విపత్తుల సమయాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం, నష్టాలను వేగంగా అంచనా వేయడం అంత సులభం కాదు.
శాటిలైట్ ఇమేజింగ్..
ఇటువంటి సమయాల్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు, తద్వారా సహాయక చర్యలు మెరుగ్గా నిర్వహించేందుకు ‘శాటిలైట్ ఇమేజింగ్’ విశేషంగా సహకరిస్తుంది. ఈ దిశగానే 1999లో ఫ్రాన్స్ ‘నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్’, ‘యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ’లు కలిసి.. ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్’ ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం 17 స్పేస్ ఏజెన్సీలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. విపత్తుల సమయంలో తమ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ప్రభావిత ప్రాంతాల ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించి సంబంధిత దేశాలకు ఉచితంగా అందజేస్తాయి. వాటిని విశ్లేషించి, అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
ప్రతికూల వాతావరణంలోనూ..
తాజాగా తమ భూకంప ప్రభావిత ప్రాంతాల వైపు శాటిలైట్ల దృష్టిని మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ‘స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్’ చార్టర్‌ను యాక్టివేట్ చేయాలని తుర్కియే అభ్యర్థించింది. సిరియా విషయంలోనూ ఐరాస చొరవ తీసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. వెంటనే 11 స్పేస్ ఏజెన్సీలు తమ ఆప్టికల్, రాడార్ ఉపగ్రహాలను ఆపరేట్ చేసేందుకు ముందుకొచ్చాయి. తొలుత ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లిన నేపథ్యంలో.. ఆ దేశం మొదటి చిత్రాలను అందించింది. ఏ సమయాల్లోనైనా, మేఘాలు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాలనూ ఇవి స్పష్టంగా చిత్రీంచగలవు.
విపత్తుల సమయంలో..
ఇదిలా ఉండగా.. 2000 నుంచి ఇప్పటివరకు 154 దేశాల్లో, 797 సార్లు ఈ చార్టర్‌ను యాక్టివేట్ చేశారు. ఇందులో దాదాపు మూడో వంతు వాతావరణ సంబంధిత విపత్తుల(తుపానులు, వరదల) సమయంలో క్రీయాశీలకం చేశారు. అయితే, యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు, వడగాలులు, దీర్ఘకాలంలో సాగే విపత్తు ప్రక్రియ(కరవులు)ల సందర్భాల్లో దీన్ని యాక్టివేట్ చేయరు. విపత్తు రకాన్ని బట్టి వివిధ ఉపగ్రహాలు రంగంలోకి దిగుతాయి. రాడార్‌శాట్, ల్యాండ్‌శాట్- 7/8, సెంటినల్-2 వంటివి ఉదాహరణలు. సహాయక చర్యలతోపాటు పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణలోనూ ఈ శాటిలైట్‌ల సమాచారం కీలకంగా మారుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్ స్టార్: సమంత
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి