Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో ఇది చోటుచేసుకుంది.

Updated : 16 Mar 2022 21:21 IST

టోక్యో: జపాన్‌ భారీ భూకంపం సంభవించింది.  ఆ దేశ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో సముద్ర తీరమైన ఫుకుషిమా ప్రాంతంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.36 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు జపాన్‌ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

20లక్షల ఇళ్లల్లో విద్యుత్‌ కట్‌!

మరోవైపు, జపాన్‌ రాజధాని నగరం టోక్యోలోనూ భూప్రకంపనలు కొద్ది నిమిషాల పాటు కొనసాగడంతో.. నగరమంతా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినట్టు సమాచారం. టోక్యోలో 7లక్షల ఇళ్లతో పాటు మొత్తంగా 20లక్షలకు పైగా ఇళ్లల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్టు టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ తెలిపింది. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్టు తెలిపింది. అప్రమత్తమైన జపాన్‌ ప్రభుత్వం ప్రధాని కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.  పలు మంత్రిత్వశాఖలు, మున్సిపాల్టీలు పరస్పర సహకారంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని