Ecuador: దేశం మొత్తం చిమ్మచీకట్లో.. కొన్ని గంటలు నరకం అనుభవించిన ఈక్వెడార్‌..!

ఈక్వెడార్‌ దేశం మొత్తం కొన్ని గంటలపాటు చిమ్మచీకట్లో ఉండిపోయింది. బుధవారం ఈ దేశంలో విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలిపోయింది.

Published : 20 Jun 2024 12:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నగరం మొత్తం ఒకేసారి కరెంటు పోతేనే మనం విలవిల్లాడుతాం. అలాంటిది దేశం మొత్తం కొన్ని గంటలపాటు విద్యుత్తు లేకపోతే పరిస్థితి ఏమిటీ..? ఆస్పత్రులు, ఇళ్లు, సబ్‌వేలు, రైల్వేలైన్లు ఇలా ప్రతీఒక్క వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. 

ఇలాంటి పరిస్థితే దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌(Ecuador)లో తలెత్తింది. ఇక్కడ బుధవారం దేశం మొత్తం ఒకేసారి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. ట్రాఫిక్‌ సిగ్నళ్ల నుంచి రైల్వే లైన్ల వరకు అన్నిరకాల వ్యవస్థలు నిలిచిపోయాయి. విద్యుత్తు నిర్వహణ, ట్రాన్స్‌మిషన్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెప్పారు. చిన్నపిల్లల ఆస్పత్రులు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. 

‘‘కొత్త పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు, నిర్వహణకు సరైన నిధుల కేటాయింపు లేకపోవడంతోనే నేడు విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలింది’’ అని పబ్లిక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ మంత్రి రాబర్టో లూక్యూ పేర్కొన్నారు. కొన్ని గంటలపాటు అంధకారం తర్వాత బుధవారం అర్ధరాత్రికి తిరిగి దేశంలో 95శాతం ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. 2004 తర్వాత ఈ దేశంలో విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలడం ఇదే తొలిసారి.

ఈక్వెడార్‌ గత కొన్నేళ్లుగా విద్యుత్తు సమస్యతో తీవ్ర అవస్థలు పడుతోంది. ఇటీవల ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతోపాటు రోజువారీ ఎనిమిది గంటలపాటు కరెంటు కోతలు కూడా అమలుచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని