Mental Health: కొవిడ్‌తో వారిలో మానసిక సమస్యలు రెండింతలు ఎక్కువ!

సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్‌(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ..

Published : 19 Jul 2022 19:16 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్‌(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముడతాయనీ అంచనా వేసింది. అమెరికాకు చెందిన పీఎన్‌ఏఎస్‌(PNAS) జర్నల్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై కరోనా తక్షణ, దీర్ఘకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకుగానూ 52- 74 ఏళ్ల మధ్య వయస్సు గల 5,146 మంది వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇందులో పాల్గొన్న వారు కరోనాకు ముందు, వైరస్‌ ఉద్ధృత దశ సమయంలో రెండుసార్లు తమ వివరాలు అందజేశారు.

ఈ అధ్యయనం ప్రకారం.. 2020 మధ్యకాలంలో కరోనా సోకని 22 శాతం మందితో పోలిస్తే.. కొవిడ్‌ సోకినట్లు భావిస్తోన్న వారిలో 49 శాతం మంది కుంగుబాటు లక్షణాలు కలిగి ఉన్నారని తేలింది. మహమ్మారి లేనివారిలో ఆరు శాతంతో పోలిస్తే.. వైరస్‌ బారిన పడినవారిలో 12 శాతం మందిలో ఆందోళన ఉందని వెల్లడైంది. అదే ఏడాది చివర్లో నిర్వహించిన కొనసాగింపు సర్వే ప్రకారం.. కరోనా సోకిన వృద్ధుల్లో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు.. ఇతరుల్లోని 33 శాతం, ఏడు శాతంతో పోలిస్తే.. 72 శాతం, 13 శాతంగా ఉన్నాయి. మహమ్మారి సోకనివారిలో 20 శాతంతో పోలిస్తే.. పాజిటివ్‌గా తేలిన వృద్ధుల్లో 40 శాతం మంది కరోనా ముందు కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో ఒంటరి భావన సైతం రెండింతలు పెరిగింది.

‘కరోనా సంక్రమణ.. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక సంబంధాలపై చూపే ప్రభావంపై ప్రస్తుతం చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. మా అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌ సోకిన వృద్ధులు.. సాధారణ వృద్ధులతో పోలిస్తే.. నిరాశ, ఆందోళన, ఒంటరితనంతో పాటు ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు. కరోనా తీవ్ర దశతోపాటు తర్వాతి ఆరు నెలల వరకు ఇవి స్పష్టంగా కనిపించాయి. కొవిడ్‌ నియంత్రణ చర్యలు, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు.. మానసిక సమస్యల పెరుగుదలకు కారణం కావచ్చు’ అని ప్రధాన అధ్యయనకర్త, బ్రిటన్‌లోని లండన్‌ యూనివర్సిటీ కాలేజ్ (యూసీఎల్‌)కు చెందిన ఎల్లీ ఐయోబ్ చెప్పారు. ‘వైరస్‌ ప్రతికూల ప్రభావం.. ప్రజల్లో దీర్ఘకాలం, విస్తృతంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యులను సంప్రదించాల’ని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని