Corona Virus: చైనాలో భయం..భయం.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు

కరోనా బాధితులతో చైనాలోని పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ప్రీజర్లు  సరిపోకపోవడంతో.. మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Published : 23 Dec 2022 01:43 IST

బీజింగ్‌: చైనా (China) లో కరోనా వైరస్‌ (Corona Virus) మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు బీఎఫ్‌ 7 (BF 7) వేరియంట్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వ్యాప్తి ప్రధానంగా వయోవృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు అక్కడి వైద్య వర్గాలు వెల్లడించాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు అధికం కావడంతో బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

చాంగ్‌క్వింగ్‌ వైద్య విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని మొత్తం రోగుల్లో.. దాదాపు 80 నుంచి 90 శాతం కరోనా బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. వయోవృద్ధులపై ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే. మృతుల సంఖ్య విషయంలో చైనా నిజాన్ని దాస్తోందన్న అనుమానాలూ ఉన్నాయి. ఆస్పత్రుల్లోని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న పలువురు సిబ్బందికి కూడా ఈ మహమ్మారి సోకుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరుకావాల్సి వస్తోందంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 గంటలకు పైగా విధులు నిర్వర్తించాల్సివస్తోందని అంటున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి చాంగ్‌క్వింగ్‌కు వచ్చిన బాధితుల, వారి బంధువుల వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. 

షాంఘైలోని వివిధ ఆస్పత్రులు, అత్యవసర విభాగాలు స్ట్రెచర్లతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్‌ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. చైనా వ్యాప్తంగా ఇంకా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. లక్షలాది మంది ప్రజలు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోలేదని రికార్డులు చెబుతున్నాయి. ఇది కూడా కొవిడ్‌ ఉద్ధృతికి ఓ కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశంలో చోటు చేసుకుంటున్న చాలా మరణాలకు కరోనా వైరస్‌ కారణం కాదని ఆ దేశం వాదిస్తోంది. ప్రభుత్వ లెక్కల్లో తప్పుగా చూపిస్తోంది. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు  కూడా సరిపోవట్లేదని షాంఘై అధికారులు వెల్లడించారు. మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని