Elon Musk: ‘ప్రపంచాన్ని ఇంటర్నెట్‌ శాసిస్తుంది’.. 25ఏళ్ల క్రితం మస్క్‌ చెప్పిన వీడియో వైరల్‌

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌(Elon Musk).. తన వ్యాపార సామ్రాజ్యంలో భారీ అంచనాలతో కూడిన నిర్ణయాలను ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో రెండున్నర దశాబ్దాల క్రితమే ఆయన ఇంటర్నెట్‌ (Internet) గురించి చెప్పిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

Published : 19 Feb 2023 14:27 IST

వాషింగ్టన్‌: ఏ రంగంలో అడుగుపెట్టినా సంచలన నిర్ణయాలతో దూసుకెళ్లే ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ఆయా రంగాలపై ఎప్పటికప్పుడు తన ముందస్తు అంచనాలను వెలువరుస్తూంటారు. ఇంతటి విజయవంతమైన బిజినెస్‌మెన్‌గా ఎదిగేందుకు ఆయనకు ఇవే దోహదపడ్డాయని చెబుతారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని ఇంటర్నెట్‌ (Internet) ఎలా శాసిస్తుందోననే విషయాన్ని 25 ఏళ్ల క్రితమే మస్క్‌ ఊహించి చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

‘ప్రపంచాన్ని ఇంటర్నెట్‌ ఎలా శాసిస్తుంది’ అని 1998లో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెస్లా సీఈవో, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ మాట్లాడారు. దీనిని టెస్లా ఓనర్స్‌ సిలికాన్‌ వ్యాలీ సోషల్‌ నెట్‌వర్క్‌ విభాగం ఇటీవల పోస్టు చేసింది. అందులో ఇంటర్నెట్‌ ప్రభంజనం గురించి ముందుగానే అంచనా వేసిన మస్క్‌.. ‘ఇది అన్ని మీడియాలను మించిపోతుంది. అన్నిరకాల మాధ్యమాలకూ ముగింపు పలుకుతుంది. ప్రింట్‌, రేడియో, చర్చలు.. ఇలా అన్ని రకాల అంశాలను ఇంటర్నెట్‌లోనే చూడొచ్చు. రెండు మార్గాల కమ్యూనికేషన్‌లో ఇది తొలి అడుగు. వినియోగదారులు తమకు ఏది కావాలో అదే ఎంచుకోవచ్చు. సంప్రదాయ మీడియాలో ఇదో విప్లవం కాబోతుందని అనుకుంటున్నా’ అని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు.

ఎలాన్‌ మస్క్‌ అప్పట్లో చెప్పిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 20లక్షల మంది ఆ వీడియో వీక్షించగా వేల కొద్ది లైకులు వచ్చాయి. రెండున్నర దశాబ్దాల క్రితమే ఇంటర్నెట్‌ విప్లవంపై మస్క్‌ వేసిన అంచనాలు ఇప్పుడు వాస్తవ రూపంలో చూస్తున్నామంటూ ట్విటర్‌ యూజర్లు పేర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని