twitter files: సెగలు పుట్టిస్తున్న ట్విటర్‌ ఫైల్స్‌.. మరో కీలక ఉద్యోగిపై మస్క్‌ వేటు

హంటర్‌ బైడెన్‌ (Hunter Biden)ల్యాప్‌టాప్‌పై 2020లో న్యూయార్క్‌ పోస్టు ప్రచురించిన కథనం ట్విటర్‌(Twitter)లో ప్రకంపనలు  సృష్టిస్తోంది. 

Published : 07 Dec 2022 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన ట్విటర్‌(Twitter) సీనియర్‌ ఉద్యోగిపై ఎలాన్‌ మస్క్‌(Elon Musk) వేటు వేశారు. జోబైడెన్‌ (joe biden ) తనయుడు హంటర్‌ బైడెన్‌ లీలలపై న్యూయార్క్‌ పోస్టు ప్రచురించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా ట్విటర్‌(Twitter) నిలిపేసింది. దీనికి సంబంధించి కంపెనీ వెబ్‌సైట్‌ డిప్యూటీ జనరల్‌ కౌన్సిల్‌ జేమ్స్‌ బేకర్‌పై ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తాజాగా వేటు వేశారు. దీనిపై మస్క్‌ స్పందిస్తూ ‘‘ప్రజా చర్చ జరగాల్సిన కీలక అంశాన్ని తొక్కిపెట్టిన విషయంలో బేకర్‌  వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆందోళనకరం. అతడు నేడు ట్విటర్‌ నుంచి వెళ్లిపోయాడు’’ అని పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో బైడెన్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే అప్పట్లో ట్విటర్‌ (Twitter)ఇలా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. హ్యాక్‌డ్‌ మెటీరియల్‌ పాలసీకి విరుద్ధంగా ఉందని వీటిని అప్పట్లో ట్విటర్‌ సెన్సార్‌ చేసింది. కానీ, వీటి పైన రాజకీయ పార్టీలు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేవు.

హంటర్‌ బైడెన్‌ (Hunter Biden) ల్యాప్‌టాప్‌ల నుంచి సేకరించిన సమాచారం విడుదలపై గతంలో ట్విటర్‌లో జరిగిన అంతర్గత సంభాషణలను గత వారం జర్నలిస్ట్‌ మాట్‌ టాబీతో కలిసి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) విడుదల చేశారు. వీటిని ‘ట్విటర్‌ ఫైల్స్ 1‌’గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మస్క్‌ వీటి విడుదలపై ప్రకటన చేయడం విశేషం. మాట్‌ టాబీ ట్విటర్‌ (Twitter) ఖాతాలో ఈ ఫైల్స్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను పోస్టు చేశారు.

హంటర్‌ ల్యాప్‌టాప్‌ ఎలా వచ్చింది..? 

అమెరికా డెలావేర్‌లోని జాన్‌పౌల్‌ మాక్‌ లాసక్‌ అనే వ్యక్తి నిర్వహించే కంప్యూటర్‌ రిపేర్‌ షాప్‌ వద్దకు 2019 ఏప్రిల్‌లో కొన్ని ల్యాప్‌టాప్‌లు మరమ్మతుల కోసం వచ్చాయి. వాటిపై బీయూ బైడెన్‌ ఫౌండేషన్‌ స్టిక్కర్లు ఉన్నాయి. వాటి నుంచి డేటా వెలికి తీయాలని కోరారు. ఆ ల్యాప్‌టాప్‌ల మరమ్మతులు పూర్తయ్యాయి. డేటాను కూడా రికవరీ చేశారు. వాటిని మరమ్మతులకు ఇచ్చిన వ్యక్తి మాత్రం మళ్లీ తిరిగి రాలేదు. సొమ్ము కూడా చెల్లించలేదు. వెలికి తీసిన డేటాలో హంటర్‌ బైడెన్‌ (Hunter Biden) మత్తుమందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియో క్లిప్‌లు, మెయిల్స్‌ వంటివి ఉన్నాయి. ఆ ల్యాప్‌టాప్‌ ఇచ్చిన వ్యక్తి హంటర్‌ బైడెనే(Hunter Biden) అని అర్ధం చేసుకొన్న సదరు వ్యక్తి భయపడిపోయాడు. 2019 డిసెంబర్‌లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొంది. అప్పటికే అతడు వాటిలోని సమాచారాన్ని కాపీ చేసి  ట్రంప్‌ సన్నిహిత వర్గాల్లోని రూడీ గులియాని న్యాయవాది  రాబర్ట్‌ కొస్టెల్లోకు అప్పజెప్పాడు. గులియాని ఈ హార్డ్‌డ్రైవ్‌ను న్యూయార్క్‌ పోస్టుకు ఇచ్చారు. 2020లో న్యూయార్క్ పోస్టు వీటిని పబ్లిష్‌ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అప్పట్లో ట్విటర్‌(Twitter) ఈ కథనాన్ని సెన్సార్‌ చేసి..  న్యూయార్క్‌ పోస్టు ఖాతాను కూడా కొన్నాళ్లు సస్పెండ్‌ చేసింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన సమాచారాన్నే ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేయించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని