Elon Musk: ఎలాన్‌ మస్క్‌.. బాత్‌రూం వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు..!

ట్విటర్‌ (Twitter) హెడ్‌ఆఫీసులో ఇటీవల పరిస్థితులు దారుణంగా మారాయని అక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆఫీసుకు వచ్చిన సమయంలో భారీ భద్రత ఉంటుందని.. ఆయన బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు (Bodyguard) ఆయన వెంటే ఉంటారనే విషయం వెల్లడైంది.

Published : 07 Mar 2023 15:39 IST

వాషింగ్టన్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను (Twitter) సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. సంస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి చర్యలు కొనసాగిస్తున్నారు. మస్క్‌ అనూహ్య నిర్ణయాలపై ఆసంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) హెడ్‌ ఆఫీస్‌కు వచ్చిన సమయంలో ఎప్పుడూ సెక్యూరిటీ నడుమే ఉంటారని.. బాస్‌ బాత్‌రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఫాలో అవుతారని సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి మీడియాకు వెల్లడించారు.

‘ట్విటర్‌ ఆఫీసుకి ఎలాన్‌ మస్క్‌ వస్తే సెక్యూరిటీ సిబ్బంది ఆయన చుట్టే ఉంటారు. కార్యాలయంలో ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎత్తైన, భారీ కాయంతో హాలీవుడ్‌ సినిమాలో మాదిరిగా బాడీగార్డులు ఉంటారు. మస్క్‌ బాత్‌రూమ్‌కి వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు ఆయన్ను ఫాలో అవుతారు’ అని ట్విటర్‌ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుత పని వాతావరణాన్ని ఆ సంస్థలో పనిచేసే ఓ ఇంజినీర్‌ వెల్లడించారు. మస్క్‌కు ఉద్యోగుల పట్ల విశ్వాసం తక్కువని.. అందుకే భయంతో ఆఫీసులో తిరిగే సమయంలోనూ బాడీగార్డులను వెంట పెట్టుకొని ఉంటారని చెప్పారు.

గతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేవారని.. ప్రస్తుతం ఆఫీసులో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విటర్‌ ఇంజినీర్‌ వెల్లడించారు. బయట నుంచి చూస్తే ఆఫీస్‌ బాగున్నట్లు కనిపిస్తుందని.. లోపల మాత్రం ఏ వస్తువూ పనిచేయదని వాపోయాడు. కార్యాలయంలోని సీసపు వస్తువులు, ట్యాప్‌లు కూడా పాడైపోయానని చెప్పారు.

ఇదిలాఉంటే, ట్విటర్‌లో అనేక మార్పులు చేస్తున్న ఎలాన్‌ మస్క్‌.. భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న విషయం తెలిసిందే. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కేంద్ర కార్యాలయంతోపాటు చాలా దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులనూ తొలగించారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని