Elon Musk: చైనాలో ల్యాండ్‌ అయిన ఎలాన్‌ మస్క్‌..!

Elon Musk China Visit: దాదాపు మూడేళ్ల తర్వాత ఎలాన్‌ మస్క్‌ చైనాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేటు జెట్‌ తాజాగా బీజింగ్ విమానాశ్రయంలో కన్పించింది.

Published : 30 May 2023 13:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అపరకుబేరుడు, టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk ).. చైనా (China) పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేటు జెట్‌ బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే.. అందులో మస్క్‌ వచ్చారా? లేదా అన్నదానిపై స్పందించేందుకు టెస్లా కంపెనీ నిరాకరించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

ఆసియా కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం ఎలాన్‌ మస్క్‌ ప్రైవేట్‌ జెట్  (Musk Private Jet) అలస్కా నుంచి బయల్దేరినట్లు విమానాల రాకపోకలను ట్రాక్‌ చేసే ఏడీఎస్‌-బి ఎక్స్ఛేంజ్‌ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ జెట్‌ జపాన్‌, దక్షిణ కొరియా మీదుగా చైనా చేరుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ విమానాశ్రయంలో మస్క్‌ ప్రైవేటు జెట్‌ను నిలిపి ఉంచిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చైనాలో పర్యటించనున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన షెడ్యూల్‌పై అటు టెస్లా (Tesla) గానీ.. ఇటు బీజింగ్‌ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మస్క్‌ డ్రాగన్‌ దేశానికి రావడం మూడేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగంగా పలువురు సీనియర్‌ చైనీస్‌ అధికారులతో ఆయన భేటీ కానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాటు షాంఘైలోని టెస్లా ప్లాంట్‌ను కూడా ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. కాగా.. టెస్లా ప్లాంట్ల విస్తరణ కోసం భారత అధికారులతో మస్క్‌ బృందం ఇటీవల చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఆయన చైనా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

టెస్లా కంపెనీకి అమెరికా తర్వాత చైనా రెండో అతి పెద్ద మార్కెట్‌. ఈ సంస్థకు చెంందిన షాంఘై ప్లాంట్.. విద్యుత్‌ వాహనాలకు అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో టెస్లాకు చైనా ఆటోమొబైల్‌ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న సమయంలో మస్క్‌ (Elon Musk).. బీజింగ్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. షాంఘైలో దాదాపు 10 వేల మెగాప్యాక్ స్టోరేజీ యూనిట్ల ఉత్పత్తే లక్ష్యంగా అతిపెద్ద బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని