మస్క్‌ మామూలోడు కాదు.. ఇ-మెయిల్‌తో లీకువీరుడ్ని పట్టేశాడు!

2008లో టెస్లా రహస్య డేటాను లీక్ చేసి, వార్తా సంస్థలకు విక్రయించిన ఆ ఉద్యోగిని ఎలా వల పన్ని పట్టుకున్నారో ఎలాన్‌ మస్క్‌ వివరించారు.

Updated : 15 Oct 2022 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది 2008. అమెరికాను మాంద్యం కుదిపేస్తున్న రోజులవి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కూడా దాదాపు దివాళ అంచుకు చేరుకుంది. అదే సమయంలో కంపెనీని లీకుల బెడద వెంటాడుతోంది. కంపెనీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఎవరో ప్రెస్‌కు చేరవేస్తుండడం కంపెనీని మరింత కలవర పెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ లీకువీరుడ్ని తెలివిగా పట్టుకోగలిగారు. అదెలాగో తాజాగా ఎలాన్‌ మస్క్‌ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

2008లో టెస్లా రహస్య డేటాను లీక్ చేసి, వార్తా సంస్థలకు విక్రయించిన ఆ ఉద్యోగిని ఎలా పట్టుకున్నారంటూ వైభవ్‌ బల్గరే అనే యూజర్‌ ఎలాన్‌ మస్క్‌ను ట్విటర్‌లో ప్రశ్నించారు. అదో ఆసక్తికర కథ అంటూ ఎలాన్‌ మస్క్‌ దానికి బదులిచ్చాడు. ‘‘ఉద్యోగులందరికీ ఒకే తరహా ఇ-మెయిల్స్‌ పంపించాం. కానీ ఒక్కో ఇ-మెయిల్‌లో వాక్యానికీ వాక్యానికీ మధ్య ఒకటీ లేదా రెండు స్పేస్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాం. దీని ద్వారా సమాచారం లీక్‌ చేసే వ్యక్తి తాలూకా బైనరీ సిగ్నేచర్‌ క్రియేట్‌ అవుతుంది. తద్వారా ఆ లీకు చేసే వ్యక్తిని పట్టుకున్నాం’’ అని వివరించాడు. ‘ఆ తర్వాత.. ఆ ఉద్యోగిని ఏం చేశారు’ అంటూ మరో వ్యక్తి ప్రశ్నించగా.. ‘ఇంకో ఉద్యోగం చూసుకోమని పంపేశాం’ అని చెప్పాడు. ‘మరి జైలుకెందుకు పంపలేదు..?’ అని మరో యూజర్‌ ప్రశ్నించగా..‘నిలదొక్కుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాం.. అందుకే’ అంటూ బదలిచ్చాడు.

ఇంతకీ ఎలా కనిపెట్టారంటే..?

కంపెనీ సమాచారాన్ని ఎవరో లీక్‌ చేస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తన కంపెనీ ఉద్యోగులకు టెస్లా ఓ ఇ-మెయిల్‌ పంపింది. కంపెనీ ఏదైతే మెయిల్‌ పంపిందో అదే మెయిల్‌ను కోట్‌ చేస్తూ ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. టెస్లా ముందుగా ఊహించినదే జరిగింది. కంపెనీ ఉపయోగించిన ట్రిక్‌ వర్కౌట్‌ అయ్యింది. ఆ ఉద్యోగి ఎవరో గుర్తించింది. టెస్లా ప్రయోగించిన ట్రిక్‌ను ఓ యూజర్‌ వివరించే ప్రయత్నం చేశాడు. టెస్లా పంపిన ఇమెయిల్‌లో ఒక వాక్యం దగ్గర ఒక స్పేస్‌.. ఇంకో వాక్యం తర్వాత రెండు స్పేస్‌లు.. మరో వాక్యం తర్వాత ఒకటే స్పేస్‌ ఇచ్చిందనుకుందాం. అప్పుడు ఆ మెయిల్‌ యూజర్‌ బైనరీ కోడ్‌ 010 అవుతుంది. ఆ ప్రకారం ఒక్కో ఇ-మెయిల్‌కు  ఒక్కో బైనరీ సిగ్నేచర్‌ ఉండేలా పంపించారు. అప్పుడు ఆ ఇ-మెయిల్‌ను ఎలాంటి ఎడిట్స్‌ లేకుండా వార్తగా ప్రచురించినప్పుడు సదరు బైనరీ సిగ్నేచర్‌ ఉన్న ఇ-మెయిల్‌ పంపిన వ్యక్తే లీకువీరుడిగా గుర్తించి ఉంటారని అతడు పేర్కొన్నాడు. దీన్నే కానరీ ట్రాప్‌ అని కూడా అంటారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని