Elon Musk: అలాగైతే.. చివరకు జపాన్‌ ఉనికినే కోల్పోతుంది

గత కొన్నేళ్లుగా క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు తేకపోతే రానున్న రోజుల్లో జపాన్‌ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు.

Published : 10 May 2022 02:10 IST

జనాభా క్షీణతపై ఎలాన్‌ మస్క్‌

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న తాజా పరిణామాలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా జపాన్‌ జనాభా గురించి ఆందోళన చెందుతూ ట్వీట్‌ చేశారు. క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు తేకపోతే రానున్న రోజుల్లో జపాన్‌ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. 2021లో జపాన్‌ జనాభా భారీగా పడిపోయిందని స్థానిక మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు.

‘మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉండేలా ఏదైనా మార్పులు చేయకపోతే చివరకు జపాన్‌ ఉనికిని కోల్పోతుంది. ఇది ప్రపంచానికి తీరని నష్టం కలిగిస్తుంది’ అని టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. గతేడాది 6లక్షల జనాభా క్షీణించిందని జపాన్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. కేవలం గతేడాదే కాకుండా జపాన్‌లో జనాభా తగ్గడం వరుసగా ఇది 11వసారి. దీంతో ప్రస్తుత జనాభా 12.5కోట్లకు పడిపోయింది. 2008 నుంచి క్రమంగా తగ్గుతోన్న జనాభా రేటులో మార్పు తేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదం అంటూ ఎలా మస్క్‌ పేర్కొన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థికవ్యవస్థ కలిగిన జపాన్‌లో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతోంది. 2008లో జనాభా పెరుగుదల గరిష్ఠంగా నమోదైన జపాన్‌లో గతేడాది 6లక్షల జనాభా తగ్గిపోయింది. గతేడాది అక్కడ 8.3లక్షల జననాలు నమోదుకాగా 14.4లక్షల మరణాలు సంభవించాయి. ఇలా ప్రతిఏటా అక్కడ మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇక ప్రస్తుతం జపాన్‌ జనాభాలో 29శాతం మంది 65ఏళ్లకు పైబడినవారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 14ఏళ్ల అంతకంటే తక్కువ వయసున్న జనాభా శాతం కేవలం 11.8శాతంగా ఉంది. ఇలా వృద్ధ జనాభా పెరుగుదలతోపాటు శ్రామిక శక్తి తగ్గిపోతుండడం జపాన్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు జపాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు విశ్లేషకులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని