Ukraine Crisis: బెడిసికొట్టిన మస్క్ ‘శాంతి ప్రణాళిక’.. కుబేరుడిపై జెలెన్‌స్కీ కౌంటర్ ఓటింగ్‌..!

రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Updated : 04 Oct 2022 19:57 IST

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక బెడిసికొట్టింది. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో సహా పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగింది. దాంతో ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) ద్వారానే ఉక్రెయిన్‌లోని ఈ నాలుగు ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ విలీన ప్రక్రియను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్రంగా ఖండించారు. ఐరాస లక్ష్యాలకూ, మూల సిద్ధాంతాలకూ విరుద్ధమని మండిపడ్డారు. 

ఇప్పుడు దీనిని ఉద్దేశించే మస్క్‌ శాంతి ప్రణాళికలో భాగంగా పలు ప్రతిపాదనలతో ట్వీట్లు చేశారు. ‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. (1954లో సోవియెట్‌ పాలకుడు కృశ్చేవ్‌.. క్రిమియాను ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారు)  దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. అలాగే తన ప్రణాళికను ఓటింగ్‌లో పెట్టారు. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. ‘మీకు ఏ మస్క్‌ ఇష్టం..? ఉక్రెయిన్‌ వైపు నిలిచేవారా..? లేక రష్యాకు మద్దతు ఇచ్చే వ్యక్తా..?’ అంటూ ఆయన కౌంటర్ ఓటింగ్ పెట్టారు.

దీనిపై మస్క్‌ స్పందిస్తూ.. తన ప్రతిపాదన ప్రజాదరణ పొందకపోయినా పర్వాలేదని, ఇక్కడ ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ‘రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేస్తోంది. క్రిమియా ప్రమాదంలో ఉంటే వారు పూర్తి యుద్ధానికి వెళ్తారు. దాంతో రెండువైపుల భారీ ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఉక్రెయిన్‌ కంటే రష్యా జనాభా మూడింతలు అధికం. మొత్తం యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం అసంభవం. మీరు ప్రజల బాగు కోరుకుంటే.. శాంతి పక్షాన ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని