Flight: 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే దిగిన విమానం..!

దుబాయ్‌( Dubai) నుంచి న్యూజిలాండ్ బయలుదేరిన ఎమిరేట్స్ విమాన ప్రయాణికులకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. టేకాఫ్ అయిన చోటే వారెక్కిన విమానం ల్యాండ్ అయింది. 

Published : 31 Jan 2023 20:26 IST

దుబాయ్‌: సుమారు 13 గంటల పాటు గాల్లో ప్రయాణించిన విమానం.. చివరకు ఊహించని విధంగా ల్యాండ్‌ అయింది. ఎక్కడి నుంచి విమానం టేకాఫ్‌ తీసుకుందో.. చివరికి మళ్లీ అక్కడే దిగేసరికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గత శుక్రవారమే ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

దుబాయ్‌( Dubai) నుంచి న్యూజిలాండ్‌( New Zealand)కు వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానం ఒకటి 13 గంటలపాటు ప్రయాణించి.. చివరికి మళ్లీ వెనక్కి వచ్చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 ప్రాంతంలో ఎమిరేట్స్‌ విమానం టేకాఫ్‌ అయింది. భారీ వరదల కారణంగా ఆక్లాండ్‌ విమానాశ్రయం నీటితో నిండిపోయింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో దాదాపు సగం దూరం ప్రయాణించిన ఎమిరేట్స్ విమానం వెను తిరగాల్సి వచ్చింది. దీనిపై ఆక్లాండ్‌ విమానాశ్రయ సిబ్బంది ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ పరిస్థితి తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. కానీ ప్రయాణికుల భద్రతే ముఖ్యం’ అని వెల్లడించారు. 

మామూలుగా టేకాఫ్ అయిన తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపం కారణంగా విమానాలు వెనుదిగిన సందర్భాలుంటాయి. కానీ 13 గంటలు పాటు ప్రయాణించి ఎక్కిన చోటే ఆగడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని