Modi to Europe: మోదీ ఐరోపా పర్యటన.. ఇంధన భద్రతే ప్రధానాంశం..!

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ఐరోపా దేశాల పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించారు.

Published : 01 May 2022 15:44 IST

ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ ప్రధాని మోదీ ఐరోపా పర్యటన

దిల్లీ: ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ఐరోపా దేశాల పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆదివారం జర్మనీ బయలుదేరనున్నారు. ఐరోపా పర్యటనకు వెళ్లేముందు స్పందించిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ తాను యూరప్‌లో పర్యటిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఐరోపా దేశాలతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. శాంతి, శ్రేయస్సును కోరుకునే భారత్‌కు ఆయా దేశాలు ఎంతో ముఖ్యమైన భాగస్వామ్యపక్షాలు అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ఇంధన భద్రతే ప్రధానాంశమని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వెల్లడించారు. ‘ప్రధానమంత్రి మోదీ పర్యటనలో భాగంగా వివిధ దేశాధిపతులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక చర్చలపైనే విస్తృతంగా దృష్టి సారించినప్పటికీ ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులు కూడా చర్చలోకి వస్తాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ఐరోపా నేతలతో ప్రధాని మోదీ జరిపే చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో భారత్‌ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని, ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు గుర్తుచేశారు.

ఇదిలాఉంటే, మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధానిమోదీ సోమవారం జర్మనీ చేరుకొని.. ఆ దేశ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అవుతారు. అనంతరం డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటిస్తారు. ఈ క్రమంలో మొత్తం 8మంది ప్రపంచనేతలతో మోదీ సమావేశం అవుతారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాను ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తరుణంలో భారత ప్రధాని ఐరోపా దేశాధినేతలతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని