UK Heatwave: ఎండల వేడికి మండుతోన్న ఇంగ్లాండ్‌.. తొలిసారి ‘ఎమర్జెన్సీ’ ప్రకటన

గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాడ్పులు వీస్తుండడంతో (Heat Waves) అప్రమత్తమైన బ్రిటన్‌ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్‌ వార్నింగ్‌’  జారీ చేసింది.

Published : 16 Jul 2022 02:16 IST

లండన్‌: గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్‌లో (UK) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండడంతో (Heat Waves) అప్రమత్తమైన బ్రిటన్‌ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్‌ వార్నింగ్‌’  జారీ చేసింది. లండన్‌తోపాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాలపాటు ఇదేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ అత్యయికస్థితిని (Emergency) ప్రకటించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

బ్రిటన్‌లో చాలా ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతుండటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని బ్రిటన్‌ వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన మెట్‌.. ఇటువంటి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ఎంతో హానికరమన్న మెట్‌ కార్యాలయం.. ఈ హెచ్చరికలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎండవేడికి దూరంగా ఉండడం, నివాస ప్రాంతాలను చల్లగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు హెచ్చరికలు ప్రకటించిన రోజుల్లో బయటి కార్యకలాపాలు, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించింది.

అధిక ఉష్ణోగ్రతల ప్రభావం సున్నితమైన వ్యవస్థలైన విద్యుత్‌, అత్యవసర సేవలైనటువంటి నీరు, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులపై పడే అవకాశం ఉందని మెట్‌ విభాగం తెలిపింది. మరోవైపు బ్రిటన్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది. ఈ పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులైన వారు కూడా అనారోగ్యం బారినపడవచ్చని.. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇలా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న బ్రిటన్‌ వాసులు.. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని