Published : 15 May 2022 01:57 IST

NATO: టర్కీ అసమ్మతి గళం.. నాటోలో ఫిన్లాండ్‌, స్వీడన్‌ల చేరికపై ఎర్డోగన్‌ అభ్యంతరం!

అంకారా: నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్‌ల చేరిక వ్యవహారంలో ఊహించని పరిణామం! టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు దేశాలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. వాటి చేరికపై తమ దేశానికి సానుకూల అభిప్రాయం లేదన్నారు. నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫిన్లాండ్‌ అధ్యక్షుడు, ప్రధాని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న స్వీడన్‌ సైతం ఇదే ఆలోచనలో ఉంది.

ఒక దేశం.. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. ముందుగా కూటమిలోని 30 సభ్యత్వ దేశాలు దానికి అధికారిక ఆహ్వానాన్ని అందించేందుకు ఏకగ్రీవంగా అంగీకరించాలి. అనంతరం.. సభ్యత్వంపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత.. సభ్య దేశాలు తుది నిర్ణయాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. నాటో సభ్య దేశమైన టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ మేరకు అసమ్మతి గళాన్ని వినిపించిన మొదటి దేశం టర్కీనే.

ఇస్తాంబుల్‌లో ఎర్డోగన్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. 1952లో గ్రీస్‌కు నాటోలో సభ్యత్వాన్ని ఆమోదించి టర్కీ మాజీ పాలకులు తప్పు చేశారని ఉటంకించారు. ఇప్పుడు అటువంటి తప్పును పునరావృతం చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. 2016లో టర్కీలో తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన అమెరికాకు చెందిన బోధకుడు ఫెతుల్లా గులెన్ మద్దతుదారులతోపాటు కుర్దిష్ గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆయన గతంలోనూ నార్డిక్ దేశాలను, ప్రత్యేకంగా టర్కీ వలసదారులకు భారీగా ఆశ్రయం పొందుతున్న స్వీడన్‌ను విమర్శించారు.

ఎర్డోగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన స్వీడన్ విదేశాంగ మంత్రి ఆన్ లిండే.. టర్కీ ప్రభుత్వం తమకు నేరుగా ఈ రకమైన సందేశాన్ని అందించలేదని తెలిపారు. శనివారం జర్మనీలో నాటో విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో టర్కీ ప్రతినిధులతో ఈ విషయమై మాట్లాడతామని చెప్పారు. ఫిన్లాండ్‌ సైతం ఇదే విధంగా స్పందించింది. మరోవైపు.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి మాట్లాడుతూ.. ఇరు దేశాల నాటో సభ్యత్వంపై టర్కీ వైఖరిని స్పష్టం చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా.. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరు దేశాలను ఉద్దేశించి రష్యా ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని