UkraineCrisis: రష్యా, బెలారస్‌లో రిజిస్టరైన కార్లు ఐరోపాలో ప్రవేశించకూడదు..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐరోపా సమాఖ్య మరిన్ని కఠిన చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే భారీఎత్తున రష్యా,

Published : 11 Apr 2022 19:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐరోపా సమాఖ్య మరిన్ని కఠిన చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే భారీఎత్తున రష్యా, బెలారస్‌లపై ఆంక్షలు విధించారు. తాజాగా ఆయా దేశాల్లో రిజిస్టర్‌ అయిన కార్లను కూడా ఐరోపా సమాఖ్యలోకి రాకుండా అడ్డుకొంటున్నారని రష్యాకు చెందిన ఫెడరల్‌ కస్టమ్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఈ నిషేధం పరిధిలోకి ప్రయాణికుల వాహనాలు, రవాణా ట్రక్కులను చేర్చారని వెల్లడించింది. ఔషధాలు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య సదుపాయాలకు అవసరమైన పరికరాలు, ఎరువులు వంటి వాటిని మాత్రం అనుమతిస్తున్నారు. కేవలం మానవతా సాయానికి సంబంధించిన వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. 

ఈ నిర్ణయంతో బాల్టిక్‌ సముద్రంలో ఉన్న రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ ప్రాంతం రష్యా ప్రధాన భూభాగం నుంచి వేరుగా ఐరోపా సమాఖ్య సభ్య దేశాలైన లిథువేనియా, పోలాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఆయా దేశాలు మాత్రం ఇప్పటికీ రష్యాలో రిజిస్టరైన వాహనాలను అనుమతిస్తున్నాయి. 

ఇప్పటికే రష్యా నుంచి వచ్చే వాణిజ్య విమానాలను నిలిపివేశారు. పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో చాలా కంపెనీలు రష్యాను వీడి వెళ్లిపోయాయి. 

జర్మనీలో రష్యా అనుకూల.. వ్యతిరేక ప్రదర్శనలు..

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశమైన జర్మనీలో రష్యా అనుకూల, ప్రతికూల వర్గాలు నిరసన ప్రదర్శనలకు దిగాయి. జర్మనీలోని వివిధ నగరాల్లో జరిగిన ఈ ఆందోళనల్లో కొందరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో జరిగిన ఆందోళనల్లో ఉక్రెయిన్‌కు మద్దతుగా 2,500 మంది పాల్గొనగా.. రష్యాకు మద్దతుగా 800 మంది వరకు పాల్గొన్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ యూరప్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని