TikTok: టిక్‌టాక్‌కు షాకిచ్చిన యూరోపియన్‌ యూనియన్‌!

యూజర్లకు మెరుగైన సైబర్‌ భద్రత (Cybersecurity)ను అందించడంలో భాగంగా టిక్‌టాక్‌ (TikTok)పై నిషేధం విధిస్తున్నట్లు ఈయూ (EU) తెలిపింది. దీనివల్ల టిక్‌టాక్‌ ద్వారా జరిగే సైబర్‌ దాడులను అడ్డుకోవచ్చని ఈయూ భావిస్తోంది.

Published : 24 Feb 2023 00:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ (EU) చైనాకి  చెందిన టిక్‌టాక్‌ (TikTok)పై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్‌సెక్యూరిటీ (Cybersecurity) ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయూ పరిశ్రమల చీఫ్‌ థియరీ బ్రెటన్‌ (Thierry Breton) తెలిపారు. ‘‘యూజర్లకు మెరుగైన సైబర్ భద్రతను అందించడంలో భాగంగా యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్ కార్పొరేట్ మేనేజ్‌మెంట్‌ బోర్డు టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. దీనివల్ల వ్యక్తిగత, కార్పొరేట్‌ డివైజ్‌లపై టిక్‌టాక్‌ ద్వారా జరిగే సైబర్‌ దాడులను అడ్డుకోవచ్చని ఈయూ భావిస్తోంది’’అని ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం వెనుక అమెరికా నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. అలానే ఈయూ ఉద్యోగులంతా తమ ఫోన్లలోంచి తక్షణం టిక్‌టాక్‌ యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. 

ఈయూ నిర్ణయంపై టిక్‌టాక్‌ స్పందించింది. ‘‘ అపోహలు, నివేదికల ఆధారంగా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదు. ప్రతి నెలా టిక్‌టాక్‌ను ఉపయోగించే 125 మిలియన్‌ యూజర్ల డేటాకు మేం ఏవిధంగా భద్రత కల్పిస్తామో ఈయూకు చెప్పేందుకు అనుమతి కోరాం. కానీ, వారు మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు’’అని టిక్‌టాక్‌ ప్రతినిధి తెలిపారు. సామాజిక మాధ్యమాల సేవలకి సంబంధించి ఈయూ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. దీంతో 45 మిలియన్‌ యూజర్లు దాటిన సామాజిక మాధ్యమాలు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు స్వతంత్ర ఆడిట్‌ను చేపట్టాలి. అలానే ఆయా సంస్థలు సేకరించే డేటాను ప్రభుత్వ సంస్థలతో షేర్ చేయాలి. గూఢచర్యం ఆరోపణలతో భారత్‌లో కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని