Hijab Protests: నిరసనకారుడికి మరణ శిక్ష విధించిన వేళ.. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు!

హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలకు సంబంధించి మొదటిసారి ఓ వ్యక్తికి మరణశిక్ష విధించిన వేళ.. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్‌ వహిదీసహా 29 మంది ప్రముఖులు, నాలుగు ప్రభుత్వ విభాగాలను తాజాగా తమ ఆంక్షల జాబితాలో చేర్చినట్లు యూరోపియన్‌ యూనియన్‌తెలిపింది.

Published : 15 Nov 2022 01:39 IST

టెహ్రాన్‌: హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శన(Hijab Protests)లకు సంబంధించి మొదటిసారి ఓ వ్యక్తికి మరణశిక్ష విధించిన వేళ.. ఇరాన్‌(Iran)పై మరిన్ని ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్‌ వహిదీ సహా 29 మంది ప్రముఖులు, నాలుగు ప్రభుత్వ విభాగాలను తాజాగా తమ ఆంక్షల జాబితాలో చేర్చినట్లు యూరోపియన్‌ యూనియన్‌(EU) ప్రకటించింది. స్థానికంగా నిరసనలను హింసాత్మకంగా అణచివేస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈయూ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు సోమవారం బ్రసెల్స్‌లో ఈ మేరకు సమావేశమయ్యారు.

‘మేం ఇరాన్ ప్రజలకు అండగా నిలుస్తాం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు మద్దతు ఇస్తాం. వారిపై ఉక్కుపాదం మోపుతోన్న వ్యక్తులపై మరో ఆంక్షల ప్యాకేజీని ఆమోదించాం’ అని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్‌ బోరెల్ ఓ ప్రకటనలో చెప్పారు. తాజా ఆంక్షలతో ఈయూ వీసాల నిషేధం, ఆస్తుల నిలిపివేత వంటి చర్యలు అమల్లోకి వస్తాయి. ఈయూ ఇప్పటికే.. ఇరాన్‌ నైతిక పోలీసు విభాగం, రెవల్యూషనరీ గార్డ్స్‌ తదితర సంస్థలతోపాటు సమాచార మంత్రి సహా 11మందిపై ఆంక్షలు విధించింది.

ఇదిలా ఉండగా.. సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరసనల్లో ఇప్పటివరకు 336 మంది మృతి చెందారని, దాదాపు 15వేలకుపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని